అమరావతి, ఆగస్టు 22: నేటి నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు రద్దుకానున్నాయి. విజయవాడ-గుణదల మధ్య జరుగుతున్న ఇంటర్ లాంకింగ్ పనుల కారణంగా కడప-విశాఖపట్టణం, విశాఖపట్టణం-కడప మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్ ప్రెస్‌ను ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు రద్దు చేశారని కడప రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్ స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. 17487 మరియు 17488 రైలు ఈనెల 22 నుంచి 29వ తేది వరకు విశాఖ-కడప మధ్య రద్దు చేశారన్నారు. 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కడప-విశాఖ మధ్య ఈ రైలును రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. రిజర్వేషన్ మొత్తాన్ని రైల్వేశాఖ ప్రయాణికులకు చెల్లింపు చేస్తుందని ఆయన వివరించారు.
విశాఖ నుంచి విజయవాడ లేదా తిరుపతి రావాలంటే అనేక మార్గాలు, ట్రైన్ లు ఉన్నప్పటికీ కడప నుంచి తిరుపతికి వెళ్లాలన్నా కడప నుంచి విజయవాడకు రావాలన్నా కడప వాసులకు ఉన్న ఏకైక ట్రైన్ తిరుమల ఎక్స్ ప్రెస్ మాత్రమే దీనిని రద్దు చేయడం వలన ఇప్పుడు ప్రయాణికులంతా బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 300 రూపాయలతో ఇక్కడి నుంచి విజయవాడ చేరుకునే ప్రయాణికులు ఇప్పుడు దాదాపు 1000 రూపాయలు వెచ్చించి విజయవాడకు చేరుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చౌకగా ప్రయాణించే రైలును ఆపేయడంతో ఇప్పుడు అధిక మొత్తంలో టికెట్లను కొనుక్కొని రవాణా చేయాల్సి వస్తుంది అని ప్రయాణికులు అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేసి మళ్లీ వెంటనే తిరుమల ఎక్స్ప్రెస్ ను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.
కడప- విశాఖపట్నం, విశాఖపట్నం – కడప మధ్య నడిచే ఏకైక రైలు తిరుమల ఎక్స్ ప్రెస్ అయితే ఈ ఎక్స్ ప్రెస్ రైలును నేటి నుంచి దాదాపు 8 రోజులపాటు రైల్వే శాఖ రద్దు చేసింది. ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ రైలు వేల మంది ప్రయాణికులకు తిరుమల కొండకు తీసుకువచ్చి తిరిగి వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.