AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాతావరణ శాఖ ఇచ్చే రంగుల అలెర్ట్స్ ఎందుకు.. ఏ కలర్ దేనికి సంకేతం..

వాతావరణ శాఖ వర్షాలు, ఎండల తీవ్రతను తెలియజేయడానికి రంగుల కోడింగ్‌ను ఉపయోగిస్తుంది. లేత ఆకుపచ్చ, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు రంగులు వేర్వేరు ప్రమాద స్థాయిలను సూచిస్తాయి. ఈ హెచ్చరికలు ప్రజలను, అధికారులను అప్రమత్తం చేసి, ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

వాతావరణ శాఖ ఇచ్చే రంగుల అలెర్ట్స్ ఎందుకు.. ఏ కలర్ దేనికి సంకేతం..
Weather Warnings
Ram Naramaneni
|

Updated on: Sep 25, 2026 | 3:36 PM

Share

వాతావరణ శాఖ విపత్తుల సమయంలో ప్రజలను, అధికారులను అప్రమత్తం చేయడానికి ప్రత్యేక రంగుల కోడింగ్‌ను ఉపయోగిస్తుంది. తీవ్రమైన ఎండలు లేదా భారీ వర్షాల ముప్పు ఉన్నప్పుడు ఈ రంగులు హెచ్చరిక స్థాయిని సూచిస్తాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ లేదా రైల్వే సిగ్నల్స్ మాదిరిగానే, ఈ రంగులు ప్రమాద తీవ్రతను సులభంగా అర్థం చేసుకోవడానికి దోహదపడతాయి. 2006 నుంచి ఈ రంగుల కోడింగ్ విధానం అమలులో ఉంది, దీని ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడం ప్రధాన లక్ష్యం. ముందుగా వర్షపాతం హెచ్చరికలలో రంగుల ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

లేత ఆకుపచ్చ రంగు:

ఈ రంగు హెచ్చరిక ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలను సూచిస్తుంది. సాధారణంగా 15.60 మిల్లీమీటర్ల నుండి 64.40 మిల్లీమీటర్ల లోపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పుడు ఈ హెచ్చరిక జారీ చేయబడుతుంది.

ముదురు ఆకుపచ్చ రంగు:

ఈ హెచ్చరిక 64.50 మిల్లీమీటర్ల నుంచి 115.50 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచిస్తుంది. అలాగే, తీవ్రమైన గాలులు వీచి, చెట్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది. వర్షం తీవ్రతతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి, చిన్న వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం కూడా ఉంటుంది.

నారింజ రంగు:

ఈ రంగు 115.60 మిల్లీమీటర్ల నుండి 204.40 మిల్లీమీటర్ల వరకు అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నప్పుడు జారీ చేయబడుతుంది. జోరు వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వరద ముంపునకు గురికావచ్చు. పాత ఇళ్లు కూలిపోయే ప్రమాదం అధికం. వాగులు ఉప్పొంగి, కుంటలు, చెరువుల్లోకి భారీ వరద వచ్చే అవకాశం ఉంది.

ఎరుపు రంగు:

అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఈ రంగు సూచిస్తుంది. 204.50 మిల్లీమీటర్ల నుంచి అంతకుమించి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. దీనివల్ల వాగులు, నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి, తీర ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వరద ధాటికి చెరువుకట్టలు తెగిపోయి, కాలువ గట్లు కోతకు గురికావచ్చు. ప్రాజెక్టుల్లోకి ఒకేసారి భారీ వరద వచ్చే ప్రమాదం ఉండటంతో జలవిలయం తప్పకపోవచ్చు.

వర్షాలతో పాటు, వేసవిలో ఎండల తీవ్రతను బట్టి కూడా వాతావరణ శాఖ వివిధ రంగుల్లో సూచనలు చేస్తుంటుంది.

ఆకుపచ్చ రంగు:

36 డిగ్రీల సెల్సియస్ లోపు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నప్పుడు ఈ సూచన జారీ చేయబడుతుంది. ఇది సాధారణ నుంచి ఓ మోస్తరు ఉష్ణోగ్రతగా పరిగణించబడుతుంది.

పసుపు రంగు:

ఈ వార్నింగ్ వచ్చినప్పుడు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ ఉండాలి, ఎందుకంటే వేడి తీవ్రత పెరిగే అవకాశాలు అధికం. మధ్యాహ్నం బయటకి వెళ్ళేవారు ఎండ బారిన పడే ప్రమాదం ఉంది.

నారింజ రంగు:

41 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నప్పుడు నారింజ రంగు హెచ్చరిక జారీ చేయబడుతుంది. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా అధికం.

ఎరుపు రంగు:

ఇది అత్యంత తీవ్రమైన పరిస్థితిని సూచిస్తుంది. 44 డిగ్రీల సెల్సియస్ లేదా ఆపైన ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయి. తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదం ఉంటుంది.

చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ కలర్ కోడింగ్ ద్వారా ప్రజలు, అధికారులు ప్రమాద తీవ్రతను సులభంగా అర్థం చేసుకుని, తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, తద్వారా ఆస్తి, ప్రాణనష్టాన్ని నివారించవచ్చు.

Follow Us