Sonu Sood: దీపావళి పండగ వేళ.. మరో చిన్నారి ప్రాణం కాపాడిన సోనూసూద్.. వీడియో చూస్తే కళ్లు చెమర్చుతాయ్
రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన సాయానికి ఆకాశమే హద్దన్న మాటను నిజం చేస్తూ ఒక చిన్నారికి ప్రాణం పోశారాయన. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన వారందరూ బాగా ఎమోషనల్ అవుతున్నారు.

కష్టాల్లో ఉన్నవారికి ‘నేనున్నా’ అంటూ అండగా నిలుస్తోన్న ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తీవ్ర గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఏడాది వయసున్న చిన్నారికి వైద్య సహాయం అందించారు. తద్వారా వారి కుటుంబ సభ్యుల కళ్లల్లో ఆనందాన్ని నింపారు.వివరాల్లోకి వెళితే.. ముంబైకు చిన్నారి రాధిక తీవ్ర గుండె సమస్యతో బాధపడుతోంది. అసలే పేదరికంతో సతమతమవుతోన్న కుటుంబానికి చిన్నారికి వైద్య చికిత్స ఖర్చు మరింత భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో 90 ఏళ్ల బామ్మ తన మనవరాలి ప్రాణాలు కాపాడాలంటూ నటుడు సోనూసూద్‌ను ఆశ్రయించారు. వయసు మీదపడినప్పటికీ మనవరాలిని ఎలాగైనా బతికించుకోవాలన్న ఆమె తపనను అర్థం చేసుకున్న సోనూసూద్ వెంటనే స్పందించారు. పాప ప్రాణాలు కాపాడేందుకు చొరవ తీసుకున్నారు. చిన్నారి శస్త్రచికిత్సకు అవసరమైన సహకారం అందించారు. ముంబై/థాణేలోని జూపిటర్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి పాప శస్త్ర చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. డాక్టర్ అశుతోష్, ఆయన నేతృత్వంలోని వైద్య బృందం చిన్నారి రాధికకు క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించింది. దీంతో చిన్నారి కుటుంబంలో ఆనందం వెల్లివెరిసింది.
కాగా చిన్నారి రాధికకు విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తయిందన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు సోనూసూద్. ఈ దీపావళికి దేవుడు తనకు ఇచ్చిన అత్యంత అందమైన బహుమతి ఇదేనంటూ ఎమోషనల్ అయ్యారీ రియల్ హీరో. ‘చిన్నారి రాధికకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స పూర్తయ్యింది. ఈ దీపావళికి నాకు దేవుడు ఇచ్చిన అత్యంత అందమైన బహుమతి ఓ చిన్నారి ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో భాగస్వామి కావడమే. రాధిక చిన్న గుండెకు మరోసారి కొట్టుకునే అవకాశం లభించింది. బామ్మ ముఖంలో చిరునవ్వు చూడడం చాలా ఆనందాన్నిస్తోంది. చిన్నారి శస్త్రచికిత్స విజయవంతం కావడంలో సహకరించిన జూపిటర్ ఆసుపత్రి యాజమాన్యానికి, డాక్టర్ అశుతోష్‌కు, వైద్య సిబ్బంది మొత్తానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ దీపావళికి నా దృష్టిలో అత్యంత ప్రకాశవంతమైన దీపం చిన్నారి రాధిక జీవితంలో వెలిగిన ఆశే’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చారు సోనూసూద్.
వీడియో ఇదిగో..
This Diwali, God gave me the most beautiful gift — the chance to be a part of saving a little life. ❤️
A 90-year-old grandmother came to me with just one desperate wish: to save her one-year-old granddaughter, Radhika, who was battling a serious heart condition.
Today, by God’s grace, her surgery has been successful. A little heart gets a new chance to beat, and a grandmother gets her biggest reason to smile.
My heartfelt gratitude to Jupiter Hospital, Dr. Ashutosh and the entire medical team.
This Diwali, the brightest diya for me is the hope shining in little Radhika’s life.
Happy Diwali! ❤️🪔🙏
— sonu sood (@SonuSood) November 8, 2026
రియల్ హీరో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఓ చిన్నారికి ప్రాణం పోసిన సోనూసూద్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




