బాబోయ్ మళ్లీ వస్తున్నాయ్.. 3 రోజులపాటు పిడుగులతో భారీ వర్షాలు.! హెచ్చరికలు జారీ
ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వానలు కురవనున్నాయి. తూర్పు దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. మరోవైపు దక్షిణ ఒడిస్సా సమీపంలోని ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుండి 4.5 కి.మీ ఎత్తులో చక్రవాక ఆవర్తనం కొనసాగుతుంది..

అమరావతి, సెప్టెంబర్ 10: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఈ రోజు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని, మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
నేడు, రేపు తెలంగాణలో వాతావరణం ఇలా..
తూర్పు దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. మరోవైపు దక్షిణ ఒడిస్సా సమీపంలోని ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుండి 4.5 కి.మీ ఎత్తులో చక్రవాక ఆవర్తనం కొనసాగుతుంది. ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
రేపు ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ రోజు, రేపు తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




