Andhra: వీరి..వీరి గుమ్మాడి.. దీని పొట్టనిండా నీళ్లేనండి..!
వీరి వీరి గుమ్మడి వీరి పేరు ఏంటి అంటూ.. చిన్నారుల ఆటలోనూ మన పెద్దలు గుమ్మడిని చేర్చి దాని వల్ల మనకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అయితే తణుకు ప్రాంతంలో ఒక అతి భారీ కూరగుమ్మడి రూపం అందర్ని ఆకర్షిస్తుంది. దాని కథా కమావీషు ఏంటో తెలుసుకుందాం పదండి..

అదేంటి గుమ్మడికాయలో నీళ్లు అంటున్నారు అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. ఈ గుమ్మడి కాయ స్పెషల్ అదేమరి. సాధారణంగా గుమ్మడికాయలు పాదులు కాస్తాయి. ఇందులో రకాలు కూడా ఉంటాయి. ఒకటి.. బూడిద గుమ్మడికాయలు.. దీని వల్ల చాలా ప్రయోజనాలున్నాయండోయ్.. ఇది ఆరోగ్యానికే కాదు.. ఇంటికి దిష్టి తగలకుండా కూడా కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి బూడిదగుమ్మడి జ్యూస్ బెస్ట్ ఆప్షన్ అని చెబుతారు. బాడీని డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది.. అందుకే చాలామంది ఉదయాన్నే బూడిదగుమ్మడి జ్యూస్ తాగుతారు. రెండోది.. తీపి గుమ్మడికాయ. ఇదికూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని కూరగా చేసుకుని తింటారు.. హల్వా చేస్తారు.. ఈ గుమ్మడితో సాంబారు చేస్తే అద్దిరిపోద్ది అంతే.. ఇంకా శుభకార్యాలప్పుడు ఇంటి సింహద్వారం దగ్గర, కార్యాలయాల ముఖ ద్వారాల వద్ద ఈ గుమ్మడి కాయలు కొట్టి పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు. అలా చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. అలాంటి గుమ్మడి కాయను కాస్త వినూత్నంగా ఆలోచించి మరోరూపంలో ఉపయోగిస్తున్నారు. నిజానికి ఇది పాదుకి కాసిన గుమ్మడికాయ కాదులెండి. సిమెంట్‌తో రూపొందించిన గుమ్మడికాయలాంటి వాటర్ ట్యాంక్. ఇప్పుడు అర్ధమైందా..గుమ్మడి కాయలోకి నీళ్లెలా వచ్చాయో.. అదండి సంగతి..!

ఇంతకీ ఇది ఎక్కడ అనేగా మీ సందేహం.. ఇలాంటి ఐడియాలు ఇంకెవరికి వస్తాయి చెప్పండి…గోదావరోళ్లకి కాకపోతే.. ఏలూరు జిల్లా తణుకులోని ఉండ్రాజవరం మండలం వేలివెన్ను జంక్షన్‌లో ఈ భారీ గుమ్మడికాయ దర్శనమచ్చింది. పెద్ద గుమ్మడి కాయ ఆకారంలో వాటర్ ట్యాంక్ నిర్మించారు. ఈ గుమ్మడికాయ స్థానికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. భారీ సైజులో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటోంది. అటుగా వెళ్లేవారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. పైగా ఆ గుమ్మడికాయ వాటర్ ట్యాంక్‌ను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో మరింత ఆకర్షణీయంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
