కృష్ణా జిల్లా గన్నవరంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్నవరంలోని స్థానిక టీడీపీ కార్యకర్తలకు, వల్లభనేని వంశఈ అనుచరుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారంటూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు పట్టుబట్టడం ఈ ఘర్షణలకు కారణమైంది. పోలీసులు చర్యలు తీసుకోకపోతే వైసీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలుగుదేశం నాయకులు హెచ్చరించారు. గన్నవరం పోలీస్ స్టేషన్ ముందు పట్టాభి సహా పలువురు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనికి కౌంటర్‌గా ఆందోళన చేపట్టారు వైసీపీ కార్యకర్తలు. వాళ్లంతా టీడీపీ ఆఫీస్‌ను ముట్టడించారు. కొందరు కార్యకర్తలు రాళ్లు రువ్వడం, ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ కార్యాలయాన్ని ధ్వసం చేయడమే కాకుండా అక్కడ ఉన్న ఐదు వాహనాలను తగులబెట్టారు. ఈ ఘటనలు గన్నవరంలో బీభత్సం సృష్టించాయి.
అయితే వంశీ ప్రోద్బలంతోనే తమ కార్యాలయంపై దాడులతో అద్దాలను, ఫర్నీచర్ ధ్వంసం చేయడమే కాకుండా అక్కడ నిలిపి ఉంచిన వాహనాలను తగులబెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రెండు రోజుల నుంచి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాకుండా ఘర్షణలకు దిగుతున్నారు. బీసీలపై దాడులు చేయిస్తున్నారంటూ వంశీపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు ఈ రోజు(ఫిబ్రవరి 20) ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ స్టేషన్‌కు ఎదురుగా వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే విజయవాడ – గన్నవరం జాతీయ రహదారిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు.
కాగా, రెండు రోజుల కిందట టీడీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు గన్నవరం ఎమ్మేల్యే వల్లభనేని వంశీ. తన గురించి తప్పుగా వాగితే గన్నవరం అంటే ఏమిటో చూపిస్తానన్నారు వంశీ. చంద్రబాబు, లోకేష్‌లకు దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ కూడా చేశారు వంశీ.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..