భానుడు ఉగ్ర రూపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్య పనులుంటేనే బయటకు వెళ్తున్న ప్రజలు, సూర్యుని ప్రచండతతో మరింత భయపడిపోతున్నారు. ముఖ్యమైన పనులమీద బయటకు వచ్చిన వారు పార్కుల్లోనూ, చెట్ల నీడన సేద తీరుతున్నారు. రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వివాహ వేడుకలు ఉన్నందున తప్పని పరిస్థితుల్లో బైక్‌పై బయటకు వెళుతున్న వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ పక్క విపరీతమైన ఉక్కబోత ఉండడంతో ప్రజలు అపసోపాలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. గురువారం నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని ప్రకటించింది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43°C – 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C – 42°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38°C – 40°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఇదిలాఉంటే.. మన్యం జిల్లా కొమరాడ, వైఎస్ఆర్ జిల్లా చాపాడు, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మండల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి.
కాగా, బుధవారం నాడు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 46°C, తిరుపతి జిల్లా ఏర్పేడులో 46°C, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 45.9°Cల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్ఆర్ జిల్లా కడప, వీరపనాయునిపల్లె, వల్లూరు,ముద్దనూరు, మండల్లాలో తీవ్రవడగాల్పులు, మిగిలిన చోట్ల మొత్తం 38 మండలాల్లో వడగాడ్పులు వీచాయి.
మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..