AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుంటూరులో దశాబ్దాల ట్రాఫిక్ కష్టాలకు చెక్.. త్వరలో రయ్ రమ్ మంటూ..

గుంటూరు అంతరవలయ రహదారి మూడో దశ పనులు వేగవంతమయ్యాయి. దశాబ్దాల కాలంగా నగరవాసులను వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం చూపుతుంది. స్వర్ణభారతి నగర్ నుంచి పెదపలకలూరు వరకు 4.21 కిలోమీటర్ల ఈ రహదారి పూర్తయితే, అమరావతి, విజయవాడలకు ప్రయాణం సులభతరం అవుతుంది, నగర రద్దీ బాగా తగ్గుతుంది. సీఆర్డీఏ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది నాటికి పూర్తి కానుంది.

గుంటూరులో దశాబ్దాల ట్రాఫిక్ కష్టాలకు చెక్.. త్వరలో రయ్ రమ్ మంటూ..
Guntur Inner Ring Road
Ram Naramaneni
|

Updated on: May 11, 2026 | 5:47 PM

Share

గుంటూరు అంతరవలయ రహదారి మూడో దశ పనులు వేగవంతమయ్యాయి. దశాబ్దాల కాలంగా గుంటూరు నగరవాసులను వేధిస్తున్న ట్రాఫిక్ రద్దీ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం చూపనుంది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసేందుకు సీఆర్డీఏ కసరత్తు చేస్తోంది. గుంటూరు నగరం విస్తరిస్తున్నప్పటికీ, ట్రాఫిక్ సమస్యలు మాత్రం వాహనదారులకు తప్పడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, రాయలసీమ, పల్నాడు ప్రాంతాల నుంచి రాజధాని అమరావతి, విజయవాడకు వెళ్లే ప్రయాణికులు నగరంలోని రద్దీతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, స్వర్ణభారతి నగర్ నుంచి పెదపలకలూరు వరకు 4.21 కిలోమీటర్ల పొడవైన అంతరవలయ రహదారి మూడో దశ పనులపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.

ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 48 కోట్ల రూపాయలు కేటాయించారు. వాస్తవానికి, ఈ ప్రాజెక్టు పనులు దశాబ్దంపైగా కొనసాగుతున్నాయి. 2010-14 మధ్య తొలి దశలో ఆటోనగర్ నుంచి రెడ్డిపాలెం వరకు పనులు పూర్తికాగా, 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారతి నగర్ వరకు రెండో దశ పూర్తయింది. 2019లో మూడో దశకు నిధులు మంజూరైనప్పటికీ, అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్రమణల తొలగింపు జరగకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రాజెక్టు పనులకు ఆటంకాలను తొలగించింది. రోడ్డు నిర్మాణం వల్ల స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకు దాదాపు 6 కోట్ల రూపాయల పరిహారం చెల్లించి, వారిని పక్కనే మరోచోట కేటాయించి, అడ్డంకులను తొలగించారు.

స్థానిక శాసన సభ్యులు బోళ్ల రామాంజనేయులు, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, నారాయణ ఈ ప్రాజెక్టును ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, పనులను తిరిగి ప్రారంభించడానికి కృషి చేశారు. వారి చొరవతో కాంట్రాక్టర్లు శరవేగంగా పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం దాదాపు 90% పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ రహదారి పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ దాదాపు సగానికి సగం తగ్గుతుందని అంచనా. రాయలసీమ, పల్నాడు, తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు నగరంలోకి ప్రవేశించకుండానే నేరుగా అమరావతి, విజయవాడ వైపు వెళ్లొచ్చు. ఇది అమరావతి రోడ్డు, లాం ఫామ్, పంచారామ క్షేత్రాలకు ప్రధాన అనుసంధాన మార్గంగా మారనుంది.

అంతేకాకుండా, అమరావతికి వెళ్లే వారికి దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఆదా అవుతుంది. నగరంలోని అంతర్గత ట్రాఫిక్ తగ్గడంతో పాటు, శివారు కాలనీల అభివృద్ధికి కూడా ఈ రహదారి ఊతమిస్తుంది. ప్రస్తుతం శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు కూడా జరుగుతున్నందున, ఈ అంతరవలయ రహదారి పూర్తి అయితే గుంటూరు ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరిపోనున్నాయి.

ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. 

Follow Us