AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోదావరి తీరానికి మరో రూ.100 కోట్ల హారతి! పుష్కరాల వేళ అభివృద్ధి పనుల్లో వేగం

గోదావరి పుష్కరాల వేళ తీర ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం మరో రూ.100 కోట్లు కేటాయించింది. ఏడు నియోజకవర్గాల్లో రూ.90 కోట్లతో 111 రహదారి పనులు చేపట్టనున్నారు. మరో రూ. 10 కోట్లతో పుష్కర ఘాట్ల వద్ద రక్షిత తాగునీటి సదుపాయాలు కల్పించనున్నారు.

గోదావరి తీరానికి మరో రూ.100 కోట్ల హారతి! పుష్కరాల వేళ అభివృద్ధి పనుల్లో వేగం
Andhra Pradesh
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Sep 01, 2026 | 3:04 PM

Share

గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న వేళ.. నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాలకు అభివృద్ధి సదుపాయాలు మరింత చేరువ కానున్నాయి. పుష్కరాలను ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా.. గోదావరి తీర గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచే అవకాశంగా ప్రభుత్వం భావిస్తోంది. ‘స్వచ్ఛ గోదావరి–పవిత్ర పుష్కరాలు’ లక్ష్యంతో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా.. తాజాగా మరో రూ.100 కోట్ల నిధులను కేటాయించింది. గ్రామీణ రహదారులు, తాగునీటి సదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నారు.

అభివృద్ధికి అదనంగా రూ.100 కోట్లు

గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల ద్వారా రూ.100 కోట్లు విడుదలయ్యాయి. గతంలో ఏపీపీసీబీ ద్వారా కేటాయించిన మరో రూ.100 కోట్లకు ఇవి అదనం. దీంతో పుష్కరాల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి పనులకు మరింత ఊతం లభించనుంది.

ఏడు నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్ధి

డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, పోలవరం ప్రాంతాల పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో రూ.90 కోట్లతో 111 పనులు చేపట్టనున్నారు. సుమారు 141 కిలోమీటర్ల మేర సీసీ, బీటీ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. గ్రామాల నుంచి పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గాలతో పాటు.. అవసరమైన చోట గ్రామాల అంతర్గత రహదారులనూ మెరుగుపరచనున్నారు.

ఘాట్ల వద్ద రక్షిత తాగునీరు

పుష్కరాలకు వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. రక్షిత తాగునీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా రూ.10 కోట్లు కేటాయించారు. ప్రతి పుష్కర ఘాట్‌లో భక్తులకు తాగునీటి సదుపాయం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.

గ్రామాల నుంచి ఘాట్ల వరకు సౌకర్యాలు

రాజోలు, పి.గన్నవరం, రామచంద్రపురం, రంపచోడవరం, ఆచంట, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో రహదారి పనులు చేపట్టనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని గ్రామాల నుంచి పుష్కర ఘాట్లకు చేరుకునే మార్గాలను మెరుగుపరచనున్నారు. పుష్కర స్నానాలు, పూజలు, పితృతర్పణాల కోసం వచ్చే భక్తులకు రాకపోకలు సులభతరం చేయడమే లక్ష్యంగా పనులు సాగనున్నాయి.

మునికూడలి.. మోడల్‌ పుష్కర పంచాయతీ

రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని మునికూడలిని ఇప్పటికే రూ.7 కోట్లతో ‘మోడల్‌ పుష్కర పంచాయతీ’గా అభివృద్ధి చేస్తున్నారు. సప్త ఋషి ఘాట్‌కు సౌకర్యాలు కల్పించడంతో పాటు.. సీసీ రహదారులు, టవర్‌ లైట్లు, మ్యాజిక్‌ డ్రెయిన్లు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులు కొనసాగుతున్నాయి.

ఏపీపీసీబీ నిధులతో మరో దశ

గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధికి ఏపీపీసీబీ ద్వారా ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించారు. పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల పరిధిలోని అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా ఈ నిధులను వినియోగించనున్నారు. జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టనున్నారు.

పుష్కరాలకే కాదు.. తీర గ్రామాలకు శాశ్వత ప్రయోజనం

పుష్కరాల కోసం చేపడుతున్న రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, ఘాట్ల అభివృద్ధి పనులు పుష్కరాల అనంతరం కూడా స్థానిక ప్రజలకు ఉపయోగపడనున్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సదుపాయాలు మెరుగుపడటం, ఘాట్లకు రాకపోకలు సులభతరం కావడం, తాగునీటి వసతులు అందుబాటులోకి రావడం వల్ల తీర గ్రామాలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరనుంది.

స్వచ్ఛ గోదావరి.. సౌకర్యవంతమైన పుష్కరాలు

గోదావరి పుష్కరాలను ప్రధాన నగరాలు, ప్రముఖ ఘాట్లకే పరిమితం చేయకుండా.. నదీ పరివాహక ప్రాంతంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కేటాయించిన రూ.100 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు అందుబాటులోకి రావడంతో.. రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, ఘాట్ల అభివృద్ధికి మరింత వేగం అందనుంది. ‘స్వచ్ఛ గోదావరి–పవిత్ర పుష్కరాలు’ లక్ష్యంతో గోదావరి తీరాన్ని పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయి.

Follow Us