AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: యమలోకానికి టికెట్లు.. కట్ చేస్తే.. వినాయకుడి మండపం చుట్టూ కాంట్రవర్సీ..

వినాయక మండపంలో యమలోకం సెట్.. లోపలికి వెళ్లాలంటే రూ.100 టికెట్.. ఇదే ఇప్పుడు వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. భక్తి ముసుగులో వ్యాపారం చేస్తున్నారంటూ గాజువాక భారీ గణపతి నిర్వాహకులకు జీవీఎంసీ అధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే స్టాళ్లు, సెట్లు తొలగించకపోతే కూల్చివేస్తామని వార్నింగ్.

Andhra Pradesh: యమలోకానికి టికెట్లు.. కట్ చేస్తే.. వినాయకుడి మండపం చుట్టూ కాంట్రవర్సీ..
Gajuwaka Ganesh Pandal Controversy
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Sep 18, 2026 | 12:48 PM

Share

విశాఖపట్నం గాజువాకలో కొలువుదీరిన భారీ గణనాథుడి ఉత్సవాలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కోటి మట్టి గాజులతో 89 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన శ్రీ దివ్య కంకణ అలంకార మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తుతుండగా.. మండపం ప్రాంగణంలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన సెట్టింగులు, వాణిజ్య కార్యకలాపాలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వినాయకుడి దర్శనం ఉచితమే అయినప్పటికీ, పక్కనే వేసిన యమలోకం, డైనోసార్ సెట్లకు టికెట్లు వసూలు చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేశారు. గాజువాక శ్రీనగర్ గ్రౌండ్‌లో ప్రతిష్ఠించిన ఈ మహా గణపతిని 21 రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉంచేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అయితే మండపానికి ఇరువైపులా వినోదం పేరుతో భారీ ఎమ్యూజ్‌మెంట్ సెట్లు వేశారు. అందులో సినిమా సెట్టింగ్‌ను తలపించేలా రూపొందించిన యమలోకం సెట్‌కు రూ.100, అలాగే డైనోసార్ పార్క్ సెట్‌కు రూ.80 చొప్పున ఎంట్రీ ఫీజు నిర్ణయించారు. అంతేకాకుండా యమలోకం సెట్ టికెట్ కొన్నవారికి లోపలి మార్గం గుండా వినాయకుడి శీఘ్ర దర్శనం కల్పిస్తుండటంతో, సాధారణ క్యూలైన్లలోని రద్దీని తప్పించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేశారు. వీటికి తోడు మైదానంలో పెద్దఎత్తున తాత్కాలిక కమర్షియల్ స్టాళ్లను సైతం ఏర్పాటు చేసి నిర్వాహకులు భారీగా ఆదాయం గడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఉత్సవాల పేరుతో ఎలాంటి వసూళ్లకు పాల్పడకూడదని, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించరాదని పోలీసులు ముందే స్పష్టమైన నిబంధనలు విధించినప్పటికీ.. ఈ మండపానికి అధికారిక అనుమతులు తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. భక్తి ముసుగులో దందా సాగుతోందన్న ఫిర్యాదులతో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులతో కూడిన జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీ శ్రీనగర్ గ్రౌండ్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. హైవే సర్వీస్ రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా భక్తుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని కమిటీ నిర్ధారించింది. తనిఖీల సమయంలో నిర్వాహకులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీ నివేదిక ఆధారంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగి నిర్వాహకులకు సీరియస్ నోటీసులు జారీ చేశారు. యమలోకం, డైనోసార్ సెట్లతో పాటు మైదానంలోని అనధికార వాణిజ్య స్టాళ్లను వెంటనే స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశించారు. గడువులోగా తొలగించకపోతే ప్రభుత్వ యంత్రాంగమే బుల్డోజర్లతో కూల్చివేస్తుందని హెచ్చరించారు. తాము భక్తితోనే ఏర్పాట్లు చేశామని, వ్యాపారం చేయడం లేదని నిర్వాహకులు వాదిస్తుండగా.. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే సాధారణ భక్తుల దర్శనానికి ఎలాంటి ఆటంకం ఉండదని పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఈ వివాదం విశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వీడియో చూడండి..

Follow Us