Andhra Pradesh: చిరంజీవితో గంటా భేటీ..! ఏపీ రాజకీయాల్లో సమ్‌థింగ్ స్పెషల్ జరగబోతుందా..?
రాజకీయంగా ఊగిసలాటలో ఉన్నవారు.. ప్రత్యేకంగా ఎవరితో భేటీ అయినా స్పెషల్‌గానే ఉంటుంది. అందుకే,మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మెగాస్టార్ చిరంజీవితో భేటీ కావడం.. ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది.
మెగాస్టార్ చిరంజీవితో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వాళ్లిద్దరూ కలిసున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో, రాజకీయంగా ఇన్‌యాక్టివ్ మోడ్‌లో ఉన్న చిరుతో.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గంటా ఎందుకు భేటీ అయ్యారనే చర్చ జోరుగా జరుగుతోంది.
ఇటీవల గాడ్‌ఫాదర్ మూవీ ఈవెంట్‌లో… పవన్ కల్యాణ్‌పై చిరంజీవి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం.. షార్ట్ గ్యాప్‌లో ఇప్పుడీ ఇద్దరు ముఖ్యులు సమావేశం కావడం.. పొలిటికల్ కారిడార్‌లో రకరకాల ఊహాగానాలకు కారణమవుతున్నాయి. తాజా రాజకీయ పరిస్థితులపై వీళ్లిద్దరి మధ్యా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తమ్ముడు పవన్ కల్యాణ్‌కు రాష్ట్రాన్ని ఏలేందుకు అవసరమైన సామర్థ్యం, నిబద్దత ఉన్నాయని.. అవసరమైతే భవిష్యత్ లో తన మద్దతు జనసేన కు ఉండొచ్చేమో అంటూ చిరు చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకే దారి తీశాయి. దానికి కొనసాగింపుగా చిరును గంటా కలవడం సంచలనం రేపుతోంది.
అయితే దసరా రోజు విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా గ్రాండ్ సక్సెస్ అయినందుకు అభినందనలు తెలపడానికే చిరంజీవిని కలిసినట్టు గంటావర్గం చెబుతోంది. అయితే, రాజకీయ వర్గాలు మాత్రం.. ఈ భేటీలో ఏదో మతలబు లేకపోలేదన్న అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు గంటా. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో.. చిరు కేంద్రంలో మంత్రిగా, గంటా రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత చిరు, పాలిటిక్స్ వదిలేసి సినిమాల్లో బిజీ అయ్యారు.. గంటా మాత్రం రాజకీయాలు కొనసాగిస్తున్నారు. అయితే, పూర్వాశ్రమంలో రాజకీయంగా కలిసి నడిచిన ఈ ఇద్దరు … మరోసారి భేటీ కావడం ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. విషమేంటనేది, ఇద్దరిలో ఎవరో ఒకరు చెబితే.. క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..