Vijayasai Reddy: 11-11-11 ముహూర్తం.. ఏపీ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన!
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విజయవాడ వేదికగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. 11వ నెల, 11వ తేదీ, ఉదయం 11 గంటల 11 నిమిషాలకు పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం నిర్ణయించారు. యువతకు ప్రాధాన్యం, ప్రజాసమస్యల పరిష్కారం, అభివృద్ధి లక్ష్యాలుగా ముందుకు వస్తున్న ఈ పార్టీ వైపు పలువురు నేతలు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కొత్త పార్టీతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయన్న ఆసక్తి నెలకొంది.

11వ నెల.. 11వ తేదీ.. 11 గంటల.. 11 నిమిషాల ముహూర్తం… ఏపీలో కొత్త పార్టీ ఆవిర్భావానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టుకున్న ముహూర్తం ఇది.. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీని ప్రకటించనున్నారు. రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా వస్తున్నట్టు ఇదివరకే చెప్పిన విజయసాయిరెడ్డి.. ప్రజాసమస్యలు, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి పార్టీవైపు కొందరు నేతలు చూస్తుండటంతో.. ఏపీ రాజకీయాలు ఎలా మారుతాయన్న ఆసక్తి నెలకొంది. రాయలసీమ పౌరుషాన్ని నిలబెట్టేందుకు పార్టీని స్థాపించబోతున్నట్టు గతంలో తెలిపిన విజయసాయిరెడ్డి.. ఇవాళ ఆ మేరకు కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. రాష్ట్రంలో ప్రధానమైన రెండు పార్టీలు, కుటుంబాల ఆధిపత్యానికి ముగింపు పలుకుతామన్నారు. అందుకోసం యువతకు పెద్దపీట వేస్తామన్నారు.
ప్రజల ఆకాంక్షలే ఎజెండాగా ముందుకు వస్తున్నట్టు ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి.. కుల, మత పిచ్చి రాజకీయాలను తిరస్కరించేలా చూస్తామన్నారు. కరువు, కరెంటు కోతలు లేని ఏపీని నిర్మిస్తామన్నారు. ప్రతీ ఎకరానికి రెండు పంటలు నీరు అందించేలా చూస్తామన్న విజయసాయిరెడ్డి.. ఉచిత విద్యుత్ అందిస్తామని చెబుతున్నారు. అంతేకాదు చదువుల భారాన్ని తగ్గించి, 100 శాతం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం పెరిగేలా చూస్తామంటున్నారు. 80 ఏళ్లుగా నెరవేరని కలలను నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న విజయసాయిరెడ్డి.. జెన్ జీలను నాయకులుగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు.
కొత్త పార్టీతో ముందుకు రాబోతున్న విజయసాయిరెడ్డి పార్టీలోకి ఇప్పటికే వలసలు కూడా షురూ అయినట్టు కనబడుతోంది. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అన్నపరెడ్డి విజయభాస్కర్ .. కొత్త పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఇలా చాలా మంది విజయసాయిరెడ్డి కొత్త పార్టీ వైపు వచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టికెట్లు దక్కని అభ్యర్ధులు కొందరు.. అసంతృప్తితో రగిలిపోతున్నారు. అలాంటి వారు కూడా విజయసాయిరెడ్డి పెట్టబోయే కొత్తపార్టీలోకి వలసలు కొనసాగించే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆ వరుసలో విశాఖపట్నంకు చెందిన పీతల మూర్తియాదవ్ కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన పీతల మూర్తియాదవ్ ప్రజాసమస్యలపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
