APPSC Group 1 అభ్యర్థులకు అలర్ట్.. ఆన్‌లైన్ దరఖాస్తుల సవరణకు అవకాశం!
APPSC గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అవకాశం కల్పించింది. మొత్తం 166 పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల కరెక్షన్ విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది. హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు కూడా దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది..

అమరావతి, నవంబర్ 11: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ అప్లికేషన్లలో తప్పులను సరిచేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు కమిషన్ దరఖాస్తుల కరెక్షన్ విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది. APPSC గ్రూప్-1 నోటిఫికేషన్‌కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు నవంబర్ 9తో ముగిసింది. అయితే దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఏవైనా వివరాలను తప్పుగా నమోదు చేసి ఉంటే వాటిని సరిచేసుకునేందుకు కమిషన్ అవకాశం కల్పించింది. మొత్తం 166 ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
గ్రూప్-1తో పాటు మరికొన్ని ఉద్యోగాల దరఖాస్తుల్లోనూ మార్పులు చేసుకునేందుకు APPSC అవకాశం కల్పించింది. హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తు సమయంలో పేరు, విద్యార్హతలు, ఇతర వ్యక్తిగత వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందుబాటులో ఉన్న కరెక్షన్ విండో ద్వారా నిబంధనలకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేసుకోవాలి.
అయితే అన్ని వివరాలను సవరించుకునే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఏయే వివరాలను మార్చుకోవచ్చో, కరెక్షన్‌కు సంబంధించిన చివరి తేదీ ఏమిటో అధికారిక వెబ్‌సైట్‌లోని సూచనలను జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే దరఖాస్తు సవరణకు అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.100 చొప్పున రుసుము చెల్లించవల్సి ఉంటుంది. APPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తుల సవరణకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులు ఉన్న అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, కరెక్షన్ విండో అందుబాటులో ఉన్న సమయంలోనే అవసరమైన మార్పులు పూర్తి చేసుకోవాలి.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్‌లైన్ దరఖాస్తుల్లో సవరణకు ఇక్కడ క్లిక్ చేయండి.




