ఇది మామూలు స్కెచ్ కాదు..! ఉద్యోగం ఫేక్.. జీతం ఫేక్.. సర్టిఫికెట్లు ఫేక్.. లోన్ మాత్రం రూ.30 లక్షలు!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఐసీఐసీఐ (ICICI) బ్యాంకును మోసగించి రూ.30 లక్షల వ్యక్తిగత రుణం పొందిన ఘటన కలకలం రేపింది. పక్కా ప్రణాళికతో నకిలీ ఆధార్, పాన్ కార్డులు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగ నియామక పత్రాలు సృష్టించి బ్యాంకును బురిడీ కొట్టించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఐసీఐసీఐ (ICICI) బ్యాంకును మోసగించి రూ.30 లక్షల వ్యక్తిగత రుణం పొందిన ఘటన కలకలం రేపింది. పక్కా ప్రణాళికతో నకిలీ ఆధార్, పాన్ కార్డులు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగ నియామక పత్రాలు సృష్టించి బ్యాంకును బురిడీ కొట్టించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రామావత్ గోపాల్, పులి సురేష్ బాబు కలిసి గంటల శంకర్ పేరుతో నకిలీ పత్రాలను రూపొందించినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ ఆధార్, పాన్ కార్డులతో పాటు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్లను తయారు చేశారు. అంతేకాకుండా, గంటల శంకర్ బెంగళూరులోని ప్రముఖ క్యాప్‌కో టెక్నాలజీస్ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నట్లు చూపిస్తూ నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, పే-స్లిప్పులను కూడా సృష్టించారు.
ఈ పత్రాలను ఐసీఐసీఐ బ్యాంకులో సమర్పించి గంటల శంకర్ పేరుతో ఏకంగా రూ.30 లక్షల వ్యక్తిగత రుణాన్ని మంజూరు చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ రుణం మంజూరు వ్యవహారంలో కీలక పాత్ర పోషించినందుకు రామావత్ సురేష్‌కు రూ.6.70 లక్షల కమిషన్ చెల్లించినట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, శంకర్ పేరుతో పొందిన క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.3 లక్షల వరకు ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ కేసులో రామావత్ గోపాల్, పులి సురేష్ బాబు, రామావత్ సురేష్, గంటల శంకర్, గంటల శ్రీనివాస్‌లను నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. వీరిలో గోపాల్, సురేష్ బాబు సుమిక్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎండీలుగా ఉన్నట్లు గుర్తించారు. నకిలీ పత్రాల తయారీ, బ్యాంకు రుణం మంజూరు చేయించిన విధానం, కమిషన్ చెల్లింపులు, క్రెడిట్ కార్డు వినియోగం వెనుక ఉన్న పూర్తి వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరహా నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఆర్థిక మోసాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. నకిలీ పత్రాలతో బ్యాంకులను మోసగించే ముఠాలపై నిఘా కొనసాగుతోందని, ఈ కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉందని సీఐ తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
