Royal Enfield Classic 650 స్పెషల్ ఎడిషన్..! 6 నిమిషాల్లో అద్భుతం చేసేసిన ఆటోమొబైల్ దిగ్గజం
భారత టూవీలర్ మార్కెట్లో Royal Enfield బైక్‌లకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ముఖ్యంగా క్లాసిక్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్‌తో వచ్చే ఈ సంస్థ మోటార్‌సైకిళ్లకు అభిమానులు ఎక్కువగా ఉంటారు. తాజాగా కంపెనీ 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తీసుకొచ్చిన Classic 650 Hypershift Edition మరోసారి ఈ క్రేజ్‌ను చాటిచెప్పింది. భారత మార్కెట్లో కేవలం 125 యూనిట్లను మాత్రమే అందుబాటులోకి తీసుకురాగా, అమ్మకాలు ప్రారంభమైన ఆరు నిమిషాల్లోపే అన్ని బైక్‌లు అమ్ముడయ్యాయి. ఈ స్పెషల్ ఎడిషన్ ధరను రూ.4.26 లక్షలుగా నిర్ణయించారు.

అక్టోబర్ 16 నుంచి 28 వరకు Royal Enfield Classic 650 Hypershift Edition బైక్ కోసం రిజిస్ట్రేషన్లు స్వీకరించారు. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన లభించింది. ప్రత్యేకమైన రంగుల మార్పు, 125 ఏళ్ల వారసత్వాన్ని గుర్తుచేసే డిజైన్ అంశాలు ఈ మోడల్‌ను సాధారణ Classic 650కు భిన్నంగా నిలబెట్టాయి. ఇంజిన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. మరి ఈ ప్రత్యేక ఎడిషన్‌లో ఉన్న ఫీచర్లు, ధర వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
రంగులు మారే పెయింట్..
Classic 650 Hypershift Editionలో ప్రధాన ఆకర్షణ దాని ప్రత్యేకమైన పెయింట్ ఫినిషింగ్. బైక్‌పై కాంతి పడినప్పుడు రెడ్, గ్రీన్, గోల్డ్ రంగుల్లో మారుతూ కనిపిస్తుంది. ఈ ప్రత్యేకమైన కలర్ స్కీమ్ మోటార్‌సైకిల్‌కు విభిన్నమైన రూపాన్ని అందిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెళ్లపై Royal Enfield 125 ఏళ్ల వారసత్వాన్ని గుర్తుచేసే ప్రత్యేక గుర్తులను ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా చేతితో గీసిన పిన్‌స్ట్రైప్స్ కూడా ఈ ఎడిషన్ ప్రత్యేకతను పెంచుతున్నాయి. సాధారణ Classic 650తో పోలిస్తే ప్రధానంగా డిజైన్, పెయింట్ వంటి కాస్మెటిక్ మార్పులే ఇందులో ఉన్నాయి. బైక్‌లోని ఇంజిన్, ఇతర ప్రధాన మెకానికల్ అంశాలను యథాతథంగా కొనసాగించారు.
అదే 648cc ఇంజిన్..
ఇంజిన్ విషయానికి వస్తే Classic 650 Hypershift Editionలో 648cc ఎయిర్/ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అందించారు. ఇది 47hp పవర్, 52.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్‌ను Royal Enfield Interceptor 650లో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ బైక్ ఛాసిస్‌ను Super Meteor 650 నుంచి తీసుకున్నారు. అయితే Super Meteorలో USD ఫోర్కులు ఉండగా, Classic 650లో సాధారణ RSU ఫోర్కులను అందించారు.
ధర విషయానికి వస్తే Hypershift Edition ధర రూ.4.26 లక్షలు. సాధారణ Classic 650 వల్లం రెడ్ వేరియంట్ ధర రూ.3.68 లక్షలు కాగా, టాప్ వేరియంట్ బ్లాక్ క్రోమ్ ధర రూ.3.82 లక్షలుగా ఉంది. అంటే ప్రత్యేక ఎడిషన్ ధర బేస్ వేరియంట్ కంటే సుమారు రూ.58,000, టాప్ వేరియంట్ కంటే రూ.43,500 ఎక్కువ.
కేవలం 125 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండటం, ప్రత్యేకమైన రంగుల డిజైన్, 125 ఏళ్ల వారసత్వాన్ని ప్రతిబింబించే గుర్తులు ఈ బైక్‌కు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. మొత్తం 125 యూనిట్లు ఆరు నిమిషాల్లోనే అమ్ముడవగా, వీటి డెలివరీలను నవంబర్ నుంచి ప్రారంభించనున్నారు.
