Scorpio, Thar Roxxకు పోటీగా కొత్త SUV.. కొత్త Toyota గురించి తెలిస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే
ఆఫ్‌రోడ్ SUVలను ఇష్టపడేవారికి Toyota నుంచి మరో ఆసక్తికరమైన మోడల్ రాబోతోంది. ప్రముఖ Land Cruiser కుటుంబం నుంచి కొత్తగా పరిచయమైన Toyota Land Cruiser FJ త్వరలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు ఆటోమొబైల్ రంగంలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ SUV 2025 అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కృతమైంది. బాక్సీ డిజైన్, బలమైన నిర్మాణం, ఆఫ్‌రోడ్ ప్రయాణాలకు అనువైన రూపంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారత్‌లోకి వస్తే Mahindra Scorpio N, Thar Roxx, Force Gurkha వంటి SUVలతో పోటీ పడే అవకాశం ఉంది.

Land Cruiser FJను ప్రత్యేకంగా రఫ్ అండ్ టఫ్ SUV లుక్‌తో రూపొందించారు. ఆకట్టుకునే బాహ్య డిజైన్‌తో పాటు ఆధునిక ఫీచర్లు, భద్రతా సదుపాయాలు కూడా ఇందులో ఉండనున్నాయి. 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానున్న ఈ SUVకు సంబంధించి భారత విడుదల తేదీ, ధరపై ఇంకా అధికారిక స్పష్టత లేదు. అయితే 2028లో దేశీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ SUV డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ వివరాలపై ఓ లుక్కేద్దాం.
బాక్సీ డిజైన్..
Toyota Land Cruiser FJను చూడగానే ఆఫ్‌రోడ్ ప్రయాణాల కోసం రూపొందించిన SUV అనే విషయం అర్థమవుతుంది. బాక్సీ డిజైన్, బలమైన బాడీ క్లాడింగ్, భారీ బంపర్లు దీని ప్రత్యేకతలు. ఇందులో 18 ఇంచుల అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, సైడ్ స్టెప్స్, LED హెడ్‌లైట్లు, LED ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. వెనుకవైపు స్పేర్ వీల్‌తో పాటు పక్కకు తెరుచుకునే టెయిల్‌గేట్‌ను ఏర్పాటు చేశారు. ఇవి SUVకు క్లాసిక్ Land Cruiser రూపాన్ని అందిస్తున్నాయి.
ఇంటీరియర్‌లో 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచుల TFT డిస్‌ప్లే ఉన్నాయి. వైర్‌లెస్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు వంటి సౌకర్యాలు కూడా అందించనున్నారు. భద్రత కోసం ఏడు ఎయిర్‌బ్యాగులు, Level-2 ADAS, ABS, EBD, 360 డిగ్రీల కెమెరా, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉండనున్నట్లు సమాచారం.
2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్..
ఇంజిన్ విషయానికి వస్తే Land Cruiser FJలో 2.7 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించనున్నారు. ఇది 164bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల్లో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ప్రస్తావన లేదు. ఈ SUV Toyota IMV ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి రూపొందింది. ఇదే ప్లాట్‌ఫామ్‌ను Fortuner, Innova, Hilux వంటి మోడళ్లలోనూ ఉపయోగిస్తున్నారు.
భారత్‌లో ఈ SUVని 2028లో విడుదల చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఛత్రపతి సంభాజీనగర్‌లోని కొత్త ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేసే అవకాశాలపైనా చర్చ జరుగుతోంది. ధర సుమారు రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. అయితే విడుదల తేదీ, ధర, తయారీకి సంబంధించి Toyota నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
