Omicron: అనంతలో ఒమిక్రాన్ కలకలం.. ఒకరికి నిర్ధారణ.. మరో ఐదుగురి రిజల్ట్స్ కోసం నిరీక్షణ.. ఆందోళనలో జిల్లా వాసులు..
Omicron: ఆంధ్రప్రదేశ్ లో మెల్లగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తూర్పుగోదావరి, విజయనగరం, ప్రకాశం వంటి జిల్లాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి..
Omicron: ఆంధ్రప్రదేశ్ లో మెల్లగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తూర్పుగోదావరి, విజయనగరం, ప్రకాశం వంటి జిల్లాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి రాగా తాజాగా అనంతపురం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శనివారం రాత్రి ప్రకటించింది. ఈనెల 18న యూకే నుంచి బెంగళూరు విమానాశ్రయం మీదుగా అనంతపురానికి వచ్చిన 51 ఏళ్ల వ్యక్తికి కొత్త వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయింది.
విదేశాల నుంచి జిల్లాకు వస్తున్న వారిపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా 20న సదరు వ్యక్తికి పరీక్షలు నిర్వహించారు. 21వ తేదీన ఫలితాలు రాగా.. కరోనా నిర్ధారణ అయింది. దీంతో జీనోమ్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి నమూనాలు పంపారు. శనివారం అర్ధరాత్రి వెలువడిన ఫలితాల్లో ఆ వ్యక్తికి ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి
బాధితుడిని క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై.. ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు జిల్లాలో ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాకు ఇప్పటివరకు 1290 మంది విదేశాల నుంచి రాగా.. అందులో 1220 మంది సమాచారం అధికారుల వద్ద ఉంది. మరో 70 మంది సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. వీరిలో అయిదుగురికి కరోనా నిర్ధారణ కాగా.. వారి జీనోమ్ పరీక్షించడానికి హైదరాబాద్‌కు నమూనాలు పంపారు. వాటి ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు.
Also Read: పిల్లలో చదువు పట్ల ఆసక్తిని పెంచే ఈ నాలుగు మొక్కలను స్టడీ రూమ్‌లో ఎక్కడ పెట్టాలంటే..