Konaseema: అర్ధరాత్రి ఇంటి ఆవరణలో వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా
రోజు రోజుకీ ఎండలు పెరుగుతుండటంతో వేసవి తాపానికి మనుషులే కాదు, పశుపక్ష్యాదులు కూడా అల్లాడుతున్నాయి. ఎండ వేడినుంచి ఉపశమనం కోసం చల్లని ప్రదేశాలను వెతుక్కుంటున్నాయి. ఈ క్రమంలో వనాల్లో ఉండాల్సిన పాములు అక్కడ ఆహరం దొరక్క, మరోవైపు ఎండ వేడిని తట్టుకోలేక జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇళ్లలో, చల్లగా ఉండే ప్రదేశాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజల కంట పడుతూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ ఇంట్లో ఓ పెద్ద నాగుపాము ఆ ఇంట్లోని వారిని పరుగులు పెట్టించింది.

కోనసీమ జిల్లాలోని కాట్రేసికోన మండలం చెయ్యేరు జలగుంట గ్రామంలో గవర రాంబాబు అనే వ్యక్తి ఇంట్లో రాత్రివేళ ఓ ఆరడుగుల నాగుపాము ప్రవేశించింది. ఇంటి ఆవరణలోని మొక్కలలో ఏదో కదులుతున్న అలికిడి విని బయటకు వచ్చిన ఆ ఇంటి యజమాని మొక్కల్లో కనిపించిన ఆ పెద్ద పామును చూసి ఒక్కసారిగా భయపడ్డాడు. ఆ పాము ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా దానిని బెదిరించి అడ్డుకున్నాడు. ఇంతలో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకున్నారు. ఆ భారీ నాగుపామును చూసి భయపడిన స్థానికులు వెంటనే స్ధానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ గణేష్‌వర్మ నాగుపామును పట్టుకుని బయటకు లాగారు. అయితే ఆ నాగుపాము పడగవిప్పి ఆ ఇంటి ఆవరణలో చాలాసేపు అలాగే ఉండిపోయింది. ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టలేదు.
ఆ నాగుపాము వేసవి తాపానికి అల్లాడుతుందని గ్రహించిన స్నేక్ క్యాచర్ నీళ్లు కావాలని అడిగాడు. ఆ ఇంట్లోని వారు నాగదేవతే తమ ఇంటికి వచ్చిందా అన్నట్టుగా ఎంతో భక్తితో పసుపు నీళ్లను అందించారు. ఆ పసుపు నీళ్లతో నాగుపాముకు అభిషేకం చేసినట్టుగా పాము పడగమీదుగా వేస్తున్నప్పుడు ఆ నాగుపాము ఎంతో ఉపశమనం పొందుతూ అక్కడున్న అందరివైపూ కృతజ్ఞతగా చూసింది. అనంతరం స్నేక్ క్యాచర్ ఆ నాగుపామును డబ్బాలో బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వేసవి తాపానికి పాములు ఇలా ఇళ్లలోకి వస్తుంటాయిని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే వాటికి హాని తలపెట్టకుండా తమకు సమాచారమివ్వాలని స్నేక్ క్యాచర్ గణేష్ స్థానికులకు తెలిపాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..