AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఫోన్‌పే వాడుతున్నారా..? బీఅలర్ట్.. ఇలాంటోడు షాపునకు వచ్చాడో గల్లాపెట్టి గల్లంతే..

ఫేక్ ఫోన్‌పే ట్రాన్సాక్షన్‌తో దుకాణదారుని మోసం చేసిన ఘటన సంచలంగా మారింది. సాధారణ కస్టమర్‌లా వచ్చి, మొబైల్ స్క్రీన్‌లో పేమెంట్ అయ్యిందని చూపించిన కేటుగాడు వేల రూపాయల సరుకుతో పరారైన ఘటన కృష్ణాజిల్లా కంకిపాడులో వెలుగుచూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Andhra: ఫోన్‌పే వాడుతున్నారా..? బీఅలర్ట్.. ఇలాంటోడు షాపునకు వచ్చాడో గల్లాపెట్టి గల్లంతే..
Fake PhonePe Transaction Scam
M Sivakumar
| Edited By: |

Updated on: Apr 02, 2026 | 12:23 PM

Share

ఫేక్ ఫోన్‌పే ట్రాన్సాక్షన్‌తో దుకాణదారుని మోసం చేసిన ఘటన సంచలంగా మారింది. సాధారణ కస్టమర్‌లా వచ్చి, మొబైల్ స్క్రీన్‌లో పేమెంట్ అయ్యిందని చూపించిన కేటుగాడు వేల రూపాయల సరుకుతో పరారైన ఘటన కృష్ణాజిల్లా కంకిపాడులో వెలుగుచూసింది. కంకిపాడు రైతుబజార్ సమీపంలోని అమీర్ కిరాణా షాప్‌లో ఈ మోసం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి సమయంలో బైక్‌పై వచ్చిన ఓ కేటుగాడు. ప్రీమియం క్వాలిటీ బియ్యం బస్తాలు కావాలని యజమానిని అడిగాడు. మొదట సాధారణ కస్టమర్‌లా ప్రవర్తిస్తూ ధరలపై బేరసారాలు జరిపి, యజమానిలో నమ్మకం కలిగించాడు. మార్కెట్ రేట్లపై అవగాహన ఉన్నట్టుగా మాట్లాడడంతో ఎలాంటి అనుమానం రాలేదు. కొంతసేపటి చర్చల తర్వాత మూడు బియ్యం బస్తాలను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. అనంతరం డబ్బులు ఫోన్‌పే ద్వారా చెల్లిస్తానని చెప్పిన ఆ కేటుగాడు.. యజమాని మొబైల్ నెంబర్ తీసుకుని కొద్ది క్షణాల్లోనే ట్రాన్సాక్షన్ పూర్తయిందని చూపిస్తూ తన మొబైల్‌లో ఒక స్క్రీన్ ప్రదర్శించాడు.

పేమెంట్ సక్సెస్ అని కనిపించిన ఆ స్క్రీన్‌ను నిజమని నమ్మిన యజమాని ఎలాంటి ధృవీకరణ చేయకుండా సరుకును అప్పగించాడు. అయితే సరుకును ఇచ్చిన కొద్దిసేపటికే యజమాని తన బ్యాంక్ అకౌంట్ చెక్ చేయగా.. డబ్బులు జమ కాలేదని తెలిసి షాక్‌కు గురయ్యాడు. అప్పటికే ఆ యువకుడు సరుకుతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో సుమారు పదివేల రూపాయలకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాల్లో కేటుగాడి కదలికలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. దుకాణంలోకి రావడం నుంచి బియ్యం బస్తాలను తీసుకెళ్లే వరకు ప్రతి కదలిక కూడా ఫుటేజ్‌లో కనిపిస్తోంది. ముఖ్యంగా మొబైల్ స్క్రీన్ చూపించిన తీరు, అతని ప్రవర్తనను పరిశీలించినప్పుడు ఇది ముందుగానే పక్కా ప్రణాళికతో చేసిన మోసమని అనిపిస్తోంది. బాధిత దుకాణ యజమాని పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీటి విలువ రూ. 10వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి..

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదే తరహాలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా మోసాలు జరిగాయా అన్న కోణంలో విచారణ సాగుతోంది. రోజంతా కష్టపడి సంపాదించే చిన్న వ్యాపారులకు ఇలాంటి మోసాలు గట్టి దెబ్బగా మారుతున్నాయి. కేవలం ఒక స్క్రీన్‌ను నమ్మడం వల్లనే భారీ నష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. పేమెంట్ చేశానన్నాడు.. స్క్రీన్ చూపించాడు.. నమ్మి సరుకు ఇచ్చాం.. అంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

డిజిటల్ పేమెంట్స్ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాపారులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కేవలం స్క్రీన్‌షాట్‌లు లేదా మెసేజ్‌లను నమ్మకుండా, డబ్బులు నిజంగా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయో లేదో నిర్ధారించుకోవాలని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Follow Us