AP News: వాలంటీర్ల విధులపై ఈసీ క్లారిటీ.. ఎన్నికల్లో కేవలం వారికి మాత్రమే పని.!
వాలంటీర్ల విధులపై స్పష్టత ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. వచ్చే ఎలక్షన్లలో వీరికి విధులు అప్పగించవద్దని చెప్పింది సీఈసీ. సచివాలయ సిబ్బందికి కేవలం ఇంకు పూసే పనే అప్పజెప్పాలంది.

వాలంటీర్ల విధులపై స్పష్టత ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. వచ్చే ఎలక్షన్లలో వీరికి విధులు అప్పగించవద్దని చెప్పింది సీఈసీ. సచివాలయ సిబ్బందికి కేవలం ఇంకు పూసే పనే అప్పజెప్పాలంది.
ఎన్నికలు వచ్చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పార్లమెంటుకు.. ఏపీతోపాటు కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీకీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో ఈ అసెంబ్లీ వార్ వాడివేడిగా జరగబోతుందన్నది అందరికీ తెలుసు. ఇప్పటికే అధికార, విపక్షాల మధ్య వెర్బల్ వార్ నడుస్తోంది. బోగస్ ఓట్లతోపాటు.. చాలా అంశాల్లో ఒకరిపై ఒకరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఈసీ కీలక ఆదేశాలు జారీచేసింది. ఏపీలో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు ఎన్నికల విధులపై స్పష్టత ఇచ్చింది ఎన్నికల సంఘం. ఈ ఆదేశాలను ఏపీ సీఈవో మీనా.. కలెక్టర్లకు ఫార్వర్డ్ చేశారు. వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించవద్దంటూ ఆర్డర్స్ పాస్ చేశారు. ఇక సచివాలయ సిబ్బందికి కేవలం ఇంకు పూసే పని ఇవ్వాలన్నారు.
వాలంటీర్లను ఎన్నికల విధులు కాకుండా.. వేరే పనులకు వాడుకోవచ్చన్నారు. వీరు ప్రతి పోలింగ్ బూత్‌లో ఒకరు మాత్రమే ఉండాలని ఆదేశించారు. గతంలో బూత్ లెవెల్ ఆఫీసర్‌గా పనిచేసిన వారిని తీసుకోవద్దన్న స్పష్టం చేసింది సీఈసీ. వాలంటీర్లను ఏయే పనులకు వాడతారన్నదానిపై ఇప్పటికింకా స్పష్టత లేదు. అయితే ఇప్పటికే అధికార పార్టీ వాలంటీర్లను తమ సైనికులుగా చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘ ఆదేశాలు రావడం వారికి కాస్త ఇబ్బందే. వాలంటీర్ వ్యవస్థను అడ్డంపెట్టుకుని వైసీపీ గెలవాలని చూస్తోందంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికైతే పెన్షన్లపంపిణీ, రేషన్ సరఫరా కోసమే వాలంటీర్లను వాడుతోంది ప్రభుత్వం. కోవిడ్ సమయంలో వారు చేసిన సేవలకు గాను గతంలో అవార్డులు, రివార్డులు కూడా ప్రకటించింది. ఈ ఏడాది కూడా వారి సేవలకు అవార్డులు ఇవ్వాలని చూస్తోంది. సేవా రత్న పేరుతో కొందరికి రివార్డులు భారీగా అందజేసే కార్యక్రమం కూడా జరుగుతోంది.
