AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో సంచలనం రేపుతున్న ఈవీఎం ధ్వంసం.. తాజా ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం!

ఓ వైపు పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలిస్తుంటే.. మరోవైపు ఏపీలో ఆయన కేంద్రంగానే పొలిటికల్ పంచాయితీ కొనసాగుతోంది. ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే.. వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఇక ఈ ఘటన సమయంలో విధుల్లో ఉన్న ఉద్యోగులపై వేటు వేసింది ఎన్నికల సంఘం.

Andhra Pradesh: ఏపీలో సంచలనం రేపుతున్న ఈవీఎం ధ్వంసం.. తాజా ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం!
Evm Destroyed Case
Balaraju Goud
|

Updated on: May 23, 2024 | 7:52 AM

Share

ఓ వైపు పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలిస్తుంటే.. మరోవైపు ఏపీలో ఆయన కేంద్రంగానే పొలిటికల్ పంచాయితీ కొనసాగుతోంది. ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే.. వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఇక ఈ ఘటన సమయంలో విధుల్లో ఉన్న ఉద్యోగులపై వేటు వేసింది ఎన్నికల సంఘం.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పొలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో వెలుగులోకి రావడం సంచలనంగా మారడంతో పాటు.. ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. పిన్నెల్లి వ్యవహారంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా.. పోలింగ్ సందర్భంగా మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని అన్నారు. అందులో 7 మాచర్ల నియోజకవర్గం పరిధిలోనే జరిగాయని వెల్లడించారు. పిన్నెల్లిపై వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని మీనా తెలిపారు.

ఇక ఘటనపై అధికారులపై చర్యలు షురూ చేసింది ఎన్నికల సంఘం. పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన పోలింగ్ అధికారి సహా ఇతర సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. మాచర్ల పోలింగ్ స్టెషన్ లో ఈవియం ధ్వంసం చేసిన వీడియో వెలుగులోకి రావడంతో సిబ్బందిపై సస్పెన్షన్ వేటుకు గురి చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్‌లో అడుగు పెట్టిన సమయంలో అక్కడ ఉన్న పోలింగ్ అధికారి, సిబ్బంది పిన్నెల్లిని అడ్డుకోకపోవడంపై చర్యలు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మే 23 గురువారం సాయంత్రంలోపు సంజాయిషీ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఇదిలావుంటే, పిన్నెల్లి వ్యవహారంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డీజీపీని కలిసి మెమోరాండం ఇచ్చారు. పథకం ప్రకారం పిన్నెల్లి దాడులు చేసారని ఆరోపించారు. పిన్నెల్లిపై హత్యాయత్నం కేసులు పెట్టాల్సిన పోలీసులు నామమాత్రం కేసులు పెట్టారన్నారు. పిన్నెల్లిపై హత్యాయత్నం కేసుతో పాటు అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.

టీడీపీ వాదనకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఈవీఎం ధ్వంసంపై మాట్లాడుతున్న టీడీపీ నేతలు.. అంతకుముందు ముందు జరిగిన ఘటనలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పిన్నెల్లి వీడియో ఫేక్ వీడియో అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఈసీ కంట్రోల్‌లో ఉండాల్సిన వీడియో లోకేష్‌ ట్విట్టర్‌లోకి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. పిన్నెల్లి తప్పుచేస్తే చట్టం చూసుకుంటుందన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల ఈవీఎం మిషన్లు పగలగొట్టారని ఎన్నికల కమిషన్‌ చెబుతోందని.. కేవలం మాచర్లలో మాత్రమే వీడియో ఎలా బయటకు వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ప్రశ్నించారు. పాల్వాయి గేట్‌ పోలింగ్‌ బూత్‌లో మొదట తమ కార్యకర్తలపై దాడి జరిగిందన్నారు. పిన్నెల్లి దాడి ఘటనకు ముందు ఏం జరిగిందో వీడియో బయటపెట్టాలన్నారు. మాచర్ల,గురజాల పోలింగ్‌ సరళిపై కోర్టును ఆశ్రయిస్తామని కాసు మహేశ్ రెడ్డి తెలిపారు.

మొత్తానికి ఏపీలో హింసాత్మక ఘటనలపై కొనసాగుతున్న రాజకీయ రగడ.. ఇప్పుడు పిన్నెల్లి ఎపిసోడ్‌ వైపు మళ్లింది. రాబోయే రోజుల్లో పిన్నెల్లి కేంద్రంగానే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…