Duronto Express: రైల్వే గేటును ఢీకొట్టి ట్రాక్‌పైకి బొలేరో వాహనం.. అప్పుడే దురంతో ఎక్స్‌ప్రెస్ రావడంతో..

ఏపీలోని ఏలూరు భీమడోలు రైల్వేగేటు దగ్గర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టి.. ఐదు గంటలపాటు నిలిచిపోయింది. గేటును ఢీకొట్టి బొలేరో వాహనం ట్రాక్‌పైకి రావడంతో ఈ ఘటన జరిగింది.

Duronto Express: రైల్వే గేటును ఢీకొట్టి ట్రాక్‌పైకి బొలేరో వాహనం.. అప్పుడే దురంతో ఎక్స్‌ప్రెస్ రావడంతో..
Train Accident

Updated on: Mar 30, 2023 | 10:54 AM

ఏపీలోని ఏలూరు భీమడోలు రైల్వేగేటు దగ్గర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టి.. ఐదు గంటలపాటు నిలిచిపోయింది. గేటును ఢీకొట్టి బొలేరో వాహనం ట్రాక్‌పైకి రావడంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్.. ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగింది. ప్రమాదంలో బొలెరో వాహనం పూర్తిగా ధ్వంసం కాగా, రైలు ఇంజిన్ దెబ్బతింది. దీంతో దురంతో ట్రైన్ దాదాపు ఐదు గంటలుగా నిలిచిపోయింది. రైల్వే అధికారులు మరో ఇంజిన్ తీసుకొచ్చి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా.. దురంతో ఎక్స్‌ప్రెస్ వస్తుండడంతో భీమడోలు జంక్షన్ వద్ద రైల్వే గేటును మూసివేశారు. అయితే, అదే సమయంలో బొలెరో వాహనంలో వచ్చిన కొందరు వ్యక్తులు గేటును ఢీకొట్టి.. అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో బొలేరో వాహనం రైల్వే ట్రాక్‌ పై ఆగిపోయింది. అదే సమయంలో రైలు వస్తుండటం చూసి నిందితులు వాహనం దిగి పరారయ్యారు. వేగంగా వచ్చిన రైలు వాహనాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో బొలేరో నుజ్జునుజ్జు కాగా.. రైలు ఇంజిన్ ముందు భాగం దెబ్బతింది.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని బొలెరోను తొలగించారు. అయితే, రైలు ఇంజిన్ దెబ్బతినడంతో మరో ఇంజిన్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. వాహనంలో వచ్చింది ఎవరు.. ఎందుకు అలా చేశారు అనే వివరాలను ఆరా తీస్తున్నారు. ఒకవేళ వారు దొంగలు అయి ఉండొచ్చని, పారిపోయే క్రమంలో గేటును ఢీకొట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. భీమడోలు వద్ద దురంతో ప్రమాదంపై వాల్తేర్ రైల్వే డివిజన్ ప్రకటన విడుదల చేసింది.. భీమడోలు వద్ద ప్రమాదం జరగడంతో విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చే రైళ్లన్నీ ఆలస్యంగా నడవనున్నట్లు పేర్కొంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..