AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan – Ganta Srinivas: విశాఖ కేంద్రంగా రాజకీయంగా కూడికలు, తీసివేతలు.. పవన్‌తో గంటా శ్రీనివాస రావు భేటీ అయ్యారనే ప్రచారం.. నో అంటున్న..

అధికారం ఎక్కడుంటే ఆయన అక్కడుంటారట. కానీ ఈసారి మాత్రం అధికారం ఆయనకు దూరంగా ఉందట. దానికి దగ్గరయ్యేందుకు ఆయన తెగ ప్రయత్నాలు చేస్తున్నారని సాగర తీరం ఎడతెగకుండా ఘోషిస్తోందంటున్నారు. ఇంతకీ నవంబర్‌ 12న విశాఖ నోవాటెల్‌ హోటల్లో ఎవరు ఎవరిని కలిశారు..

Pawan Kalyan - Ganta Srinivas: విశాఖ కేంద్రంగా రాజకీయంగా కూడికలు, తీసివేతలు..  పవన్‌తో గంటా శ్రీనివాస రావు భేటీ అయ్యారనే ప్రచారం.. నో అంటున్న..
Ganta Srinivas and Pawan Kalyan
Sanjay Kasula
|

Updated on: Nov 17, 2022 | 8:15 PM

Share

ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ఈనెల 12 న విశాఖ లో రాజకీయంగా తెగ హడావుడి జరిగింది. ఏపీ రాజకీయాలన్నీ విశాఖలోనే కేంద్రీకృతమై రాజకీయ తుపాన్‌కు ముందుండే వాతావరణాన్ని సృష్టించనట్టయిందంటున్నారు. ప్రధాని పర్యటనకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖకు వెళ్లారు మరోవైపు మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కూడా విశాఖలోనే మకాం వేశారు. ఇంకోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ప్రధానితో జరిగిన పార్టీ కోర్‌ కమిటీ మీటింగ్‌లో పాల్గొన్నారు. దీనికితోడు ఆయా పార్టీల కీలక నేతలు కూడా విశాఖలో బస చేశారు. అయితే ఈ పొలిటికల్‌ సందడిలో ఓ సైలెంట్‌ సడేమియా కూడా హల్‌చల్‌ చేశారట. ఆయనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అని చెబుతున్నారు. అదే రోజు మధ్యాహ్నం ప్రధాని పర్యటన ముగిసిన వెంటనే మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు Novotel హోటల్ కి వచ్చారు. నేరుగా ఐదో ఫ్లోర్ కు వెళ్లారు. అదే ఫ్లోర్ లో జన సేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా ఉండడంతో రాజకీయ ఊహాగానాలకు తెర లేచిందట.

జనసేన-బీజేపీ కూటమి బలోపేతానికా..?

ఐదో ఫ్లోర్‌లో గంటా దాదాపు రెండున్నర గంటల పాటు ఉన్నారు. దీంతో పవన్‌తో గంటా భేటీ అయ్యారనే ప్రచారం జరిగింది. గంటా జన సేనలో చేరేందుకు వేదిక సిద్ధం అయిందని, అందుకే పవన్ తో తుది చర్చలకు ఆయన వెళ్లారని రాజకీయవర్గాల్లో చర్చ జరిగిందంటున్నారు. అయితే గంటా దానిని ఖండించారు. అదే ఫ్లోర్ లో ఉన్న తన స్నేహితుడు, బీజేపీ నేత టీజీ వెంకటేష్‌తో లంచ్ చేసేందుకు మాత్రమే తాను వెళ్లానని, పవన్ అక్కడే ఉన్నారన్న విషయం టీజీ వెంకటేష్ రూమ్‌కి వెళ్లేవరకు తనకు తెలియనే తెలియదని చెప్పారట గంటా. అయితే గంటా ఎంత చెప్పినా రాజకీయ గంటలు మాత్రం గణగణమని మోగుతున్నాయంటున్నారు. పవన్, టీజీ, గంటా… ఈ ముగ్గురూ భేటీ అయ్యారని, జనసేన – బీజేపీ కూటమిని బలోపేతం చేయడానికి వీళ్ల మధ్య చర్చలు జరిగాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

పార్టీ మారతారనే ప్రచారం..

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు విభజన తర్వాత ఏపీ తొలి మంత్రివర్గంలోనూ ఐదేళ్లు మానవ వనరుల శాఖా మంత్రి గా పనిచేసిన గంటా శ్రీనివాస రావు, 2019 లో విశాఖ నార్త్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచారు. గంటా ఆ తర్వాత టీడీపీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కాకపోవడంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. అధికారం ఎక్కడ ఉంటే గంటా అక్కడ ఉంటారని ఏపీ రాజకీయాల్లో నానుతున్న ఓ నానుడి కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చిందట. ఆయన అధికార వైసీపీ లో చేరడానికి ముహూర్తం ఖరారైనట్టు కూడా ప్రచారం జరిగింది. అప్పట్లో వైసీపీలో గంటా చేరికకు విజయసాయి రెడ్డి అభ్యంతరం అంటూ వార్తలు కూడా వచ్చాయి.

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై రాజీనామా..

ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్పీకర్ ఫార్మాట్‌లో గంటా రాజీనామా చేశారు. ఆ రాజీనామా ఆమోదం కోసం వ్యక్తిగతంగానూ అముదాలవలస వెళ్లి స్పీకర్ ను కలిశారు. అనంతరం అడపాదడపా టీడీపీ కార్యక్రమాలకు హాజరవుతున్నా పూర్తిస్థాయిలో ఎక్కడా ఆ పార్టీతో కలిసి ఉన్నారన్న అభిప్రాయం ఆయన అనుచరుల్లో కూడా లేదంటున్నారు.

అదంతా దుష్ప్రచారం..

అయితే దీనిపై గంటా వాదన భిన్నంగా ఉందంటున్నారు. 1996లో తటస్థులను ఆహ్వానించిన సందర్భంలో తాను టీడీపీలో చేరానని, 1999 లో అనకాపల్లి టీడీపీ ఎంపీ గా, 2004 లో చోడవరం టీడీపీ ఎమ్మెల్యే గా ఎన్నిక అయ్యానని చెబుతున్నారు. 2009 లో మాత్రం అప్పటి పరిస్థితుల నేపథ్యం, మెగా ఫ్యామిలీ తో అనుబంధం నేపథ్యం లో పీఆర్పీకి వెళ్లానని ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో తాను అందులో చేరాల్సి వచ్చిందని ఆయన చెబుతున్నారని సమాచారం.

తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీడీపీలోనే చేరానని, 2014 లో భీమిలి నుంచి, 2019 లో వైజాగ్ నార్త్ నుంచి టీడీపీ నుంచే పోటీ చేశానని, మొత్తం ఐదు సార్లు తాను ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్క 2009 లో నే పిఆర్పీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానే తప్ప మిగతా నాలుగు సార్లు టీడీపీ నుంచే పోటీ చేశానని, కొందరు తనపై పార్టీలు మారుతానని దుష్ప్రచారం చేస్తున్నారంటూ గంటా వాపోతున్నారని చెబుతున్నారు. తాను ఇప్పటిదాకా ఓడిపోకపోవడంతోనే ఇలాంటి చౌకబారు విమర్శలు వస్తున్నాయని గంటా ఘంటాపథంగా చెబుతున్నారు

భేటీ జరిగిందా? లేదంటే..!

దీంతో గంటా – పవన్ – టీజీల భేటీ జరిగిందా? లేదంటే గంటా చెప్పినట్టు ఇదంతా టేకిట్‌ ఈజీ ప్రచారమా? జన సేన – బీజేపీ కూటమి రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతోందా? గంటా దానికోసమే వేచి చూస్తూ ఉన్నారా? ఈ ప్రశ్నలకు కాలంతో పాటు రాజకీయ వర్గాలు కూడా సమాధానం చెప్పాలి. అప్పుడే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న రాజకీయ గంట మళ్లీ గణగణమని ఏ పార్టీలో మోగుతుందో తెలుస్తుందంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం