Droupadi Murmu: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారుల కీలక నిర్ణయం.. శ్రీశైలంలో దర్శనాలు నిలిపివేత
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో.. శ్రీశైలంలో రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. రాష్ట్రపతి శ్రీశైలానికి వచ్చేటప్పుడు, తిరిగి వెళ్ళేటప్పుడూ ట్రాఫిక్....
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో.. శ్రీశైలంలో రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. రాష్ట్రపతి శ్రీశైలానికి వచ్చేటప్పుడు, తిరిగి వెళ్ళేటప్పుడూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఆలయ అధికారులు. భక్తులు సహకరించాలని కోరారు. కాగా.. రాష్ట్రపతి శ్రీశైలం పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ పిలుపునిచ్చారు. పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రపతి విడిది చేయనున్న భ్రమరాంబ అతిథి గృహంలో ఏ లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దేవస్థానం ఈవో ఎస్.లవన్నను ఆదేశించారు. చెంచు విద్యార్థుల స్వాగత నృత్యం, చెంచులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చూడాలన్నారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శ్రీశైలం ట్రాఫిక్‌లో ఆంక్షలు విధిస్తున్నట్లు ఎస్పీ రఘువీర్‌రెడ్డి శనివారం తెలిపారు. లింగాల గట్టు, శిఖరం పాయింట్ల వద్ద సోమవారం ఉదయం 11.10 గంటలకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తామన్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు లింగాల గట్టు, శిఖరం వద్ద వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రపతి హెలీకాప్టర్ బయల్దేరి వెళ్లిన తర్వాత సున్నిపెంట నుంచి శ్రీశైలానికి వాహనాల రాకపోకలు అనుమతిస్తామన్నారు.
రాష్ట్రపతి శ్రీశైలం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పటిష్ట బందోబస్తుకు చర్యలు చేపట్టారు. భారత వాయుసేనకు చెందిన హెలీకాప్టర్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. హెలీప్యాడ్ వద్ద బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..