Andhra Pradesh: వైసీపీ ఫిర్యాదుతో స్పందించిన ఎలక్షన్ కమిషన్.. ఆ ఓట్లపై ఫోకస్..
ఇదంతా ఒక ఎత్తయితే డబుల్ ఎంట్రీ ఓట్ల సమస్య మరొకటి. తెలంగాణలో ఎన్నికలు ముగియడంతో అక్కడ ఓటు వేసిన వారు తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధానంగా అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఒక వ్యక్తి దేశంలో ఒకే చోట ఒక్క ఓటు మాత్రమే ఉండాలనేది తమ పార్టీ అభిమతంగా చెబుతుంది. ప్రజాస్వామ్యంలో ఇష్టానుసారం ఎక్కడపడితే అక్కడ ఓటు వేయకుండా చర్యలు...
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఓటర్ల జాబితా పంచాయతీ నడుస్తోంది.. రెండు ప్రధాన పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్,తెలుగుదేశం ఓట్ల గల్లంతు ,నకిలీ ఓట్లపై వరుస ఫిర్యాదులు చేస్తున్నాయి. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేస్తున్నారంటూ.. ఇరు పార్టీలు సీఈఓ ముకేష్ కుమార్ మీనాకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నాయి.
ఇదంతా ఒక ఎత్తయితే డబుల్ ఎంట్రీ ఓట్ల సమస్య మరొకటి. తెలంగాణలో ఎన్నికలు ముగియడంతో అక్కడ ఓటు వేసిన వారు తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధానంగా అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఒక వ్యక్తి దేశంలో ఒకే చోట ఒక్క ఓటు మాత్రమే ఉండాలనేది తమ పార్టీ అభిమతంగా చెబుతుంది. ప్రజాస్వామ్యంలో ఇష్టానుసారం ఎక్కడపడితే అక్కడ ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఇదే అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు పలుమార్లు వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేసారు.
రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్నాటకలో కూడా కొంతమంది ఓటు హక్కు కలిగి ఉన్నారని. అలాంటి ఓట్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తికావడంతో అక్కడ ఉన్న లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ కి చెందిన సెటిలర్లు తిరిగి ఏపీలో ఓటు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీఈవోకు ఫిర్యాదు చేశారు. రెండు ప్రాంతాల్లో 4 లక్షల 30వేల 264 మందికి ఓట్లు ఉన్నాయంటూ ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ అధికారులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్ జిల్లాల కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేసింది.డబుల్ ఎంట్రీ ఓట్లపై ఫిర్యాదులు వచ్చిన చోట పరిశీలన చేయాలని కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా.
తెలంగాణలో ఓటువేస్తే ఏపీలో వేసేందుకు నో చాన్స్..
డబుల్ ఎంట్రీ ఓట్ల రచ్చ కొంతకాలంగా నడుస్తోంది. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంశాన్ని లేవనెత్తింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఏపీలో ఓటు వేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ప్రగతి నగర్‌లో క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇలా చేయడం సరికాదంటూ ఎన్నికల కమిషన్ కు వైసీపీ మంత్రులు ఫిర్యాదు చేశారు. ఇలాంటి బోగస్ ఓట్లను ఏరివేయాలని కోరారు .అటు చంద్రబాబు కూడా సరైన ఆధారాలుంటే డబుల్ ఎంట్రీలను తొలగించాలని సీఈఓకు లేఖ రాశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే ఎన్నికల కమిషన్ కలెక్టర్లకు సూచనలు చేయడం చర్చగా మారింది.
1950 ప్రజాప్రాదినిధ్య చట్టం సెక్షన్ 17,18 ప్రకారం ఒక వ్యక్తి ఒకచోట మాత్రమే ఓటర్ గా నమోదు చేయించుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉండకూడదని ఈసీ పేర్కొంది. ఒకవేళ తనకు ఓటు ఉందనే విషయాన్ని దాచి పెట్టి కొత్తగా ఓటు కోసం నమోదు చేసుకున్నట్లయితే సెక్షన్ 31 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. ఇటీవల కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం ఫారం -6 లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని.. దీనికి కూడా కొన్ని నిబంధనలున్నట్లు ఈసీ పేర్కొంది.
ఫారం – 6ను మొదటిసారి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు మాత్రమే ఉపయోగించాలని, అంతకు ముందు ఓటు ఉంటే దాన్ని మార్పు చేసుకోవడం కోసం ఫారం – 8 మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేస్తోంది. ఫారం – 6 ద్వారా కొత్తగా ఓటు హక్కు కల్పించాలంటే క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనల ప్రకారం ఎక్కడైతే రాజకీయ పార్టీల నుంచి డబుల్ ఎంట్రీ ఫిర్యాదులు వస్తాయో అటువంటి వాటిపై తప్పనిసరిగా పర్యవేక్షణ అవసరం అని కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈసీ తాజా ఆదేశాలతో తెలంగాణలో ఓటు వేసి తిరిగి ఏపీలో ఓటు వేయాలనుకునే వారిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించనున్నారు.అయితే ఫిర్యాదులు వచ్చిన చోట మాత్రమే ఇది సాధ్యపడుతుందని చెబుతున్నారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..