అతనో ఎస్సై..ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత గల ఉద్యోగంలో ఉంటూ..తనే బాధ్యత విస్మరించాడు..కట్టుకున్న భార్యను కట్నం కోసం వేధిస్తూ చివరకు కష్టాలు కొనితెచ్చుకున్నాడు. అదనపు కట్నం తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఓ బాధ్యత కలిగిన ఎస్సై తన భార్యను అదనపు కట్నం కోసం వేధించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండలం ముదివేడు ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న సుకుమార్ భార్య డి. విష్ణు ప్రియ @ జాస్పర్ ఏంజెల్‌ను అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. అదనపు కట్నంగా 12 లక్షల రూపాయలు తీసుకు రావాలని వేదించేవాడని, అడిగిన కట్నం తేలేని పక్షంలో గన్‌తో కాల్చేస్తానని బెదిరించేవాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు పై క్రైమ్ నెం155/ 2022 అండర్ సెక్షన్ 3,4 డిపి ఆక్ట్ , 323 , 498 ఏ , 506 ఐపిసి సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎస్సై సుకుమార్ అతని భార్య విష్ణుప్రియ కు మధ్య తరచూ తగాదాలు జరిగేవని, కుటుంబ గొడవల నేపథ్యంలో పలుమార్లు పోలీసుల వద్దకు పంచాయతీ చేరిందని తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసులు ఇరు కుటుంబీకులకు నచ్చజెప్పి…కౌన్సెలింగ్ నిర్వహించినా సఖ్యత కుదరలేదని సుకుమార్ భార్య వాపోయింది. చివరకు చేసేది లేక ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సుకుమార్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఫిర్యాదు పై క్రైమ్ నెం155/ 2022 అండర్ సెక్షన్ 3,4 డిపి ఆక్ట్ , 323 , 498 ఏ , 506 ఐపిసి సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.