Vizag Steel Plant :టౌన్‌షిప్‌లో దొంగల వీరవిహారం…కాదంటే కత్తి తీస్తారు లేదంటే తుపాకీతో..ఇంత దారుణమా..?
విశాఖ మహానగరంలో టౌన్ షిప్ అంటే టక్కున గుర్తొచ్చేది స్టీల్ ప్లాంట్. విశాఖ ఉక్కులో పనిచేసే ఉద్యోగుల కోసం.. ఇక్కడ కాలనిని నిర్మించారు. దాదాపు మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్.
విశాఖ మహానగరంలో టౌన్ షిప్ అంటే టక్కున గుర్తొచ్చేది స్టీల్ ప్లాంట్. విశాఖ ఉక్కులో పనిచేసే ఉద్యోగుల కోసం.. ఇక్కడ కాలనిని నిర్మించారు. దాదాపు మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్. 9450 క్వార్టర్స్ లో వేర్వేరు సెక్టర్లు గా విభజించారు. సెక్టర్లు నెంబర్ 7 లో అధికారులు డైరెక్టర్లు నివసిస్తారు. మిగిలిన సెక్టర్లలో ఉద్యోగులు ఉంటారు. సువిశాలమైన ప్రాంగణంలో విస్తరించి ఉన్న స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్‌లో చెట్లు, పచ్చదనం విరివిగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మినీ ఫారెస్ట్ గా ఉంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్.
ఇంత వరకు బాగానే ఉన్నా… చాలా వరకు నిర్మానుష్య ప్రాంతాలు ఇప్పుడు నేరస్తులకు అడ్డాలుగా మారుతున్నాయి. దోపిడిలు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు.. మెడపై కత్తి ఎక్కుపెట్టి ఆభరణాలు దోచుకుంటున్నారు. ప్రతిఘటిస్తే తుపాకీతో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్నారు. అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా సెక్టర్ 5, 10 ప్రాంతాల్లో జరిగే దోపిడీలు హడ లెత్తిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వరుసగా జరుగుతున్న ఘటనలతో ఈ ప్రాంతం బెంబేలెత్తి పోతుంది. తాజాగా.. సెక్టర్ 10లో జరిగిన ఘటన విశాఖ నే ఉలిక్కిపడేలా చేసింది. మే నెల 23వ తేదీ రాత్రి ఆలయానికి వెళ్లిన ఓ మహిళ.. నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఇదే సమయంలో టార్గెట్ చేసిన ఓ దొంగ.. ఆమెను అనుకరించాడు. అదును చూసి వెనకవైపు నుంచి వచ్చాడు. చేతిలో ఉన్న కత్తిని మెడ పై పెట్టి మేడలో ఉన్న ఆభరణాలను లాక్కున్నాడు. అక్కడ నుంచి పారిపోయే సమయంలో ఆ మహిళ పెద్దగా కేకలు వేసింది. దీంతో వాకింగ్ చేస్తున్న స్టీల్ ప్లాంట్ అధికారి మనోహర్.. దొంగను అడ్డుకొని పట్టుకున్నాడు. దీంతో ఆ దొంగ మనోహర్ పై కత్తితో దాడి చేశాడు. ఇదే సమయంలో స్థానికంగా ఉన్న వాళ్లంతా చుట్టూ చేరి దొంగని చుట్టుముట్టారు. పట్టుకొని దేహశుద్ధి చేశారు. గాయాలపాలైన శ్రీను ప్లాంట్ అధికారి మనోహర్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే పట్టుబడిన ఆ దొంగ వద్ద కత్తి తో పాటు ఓ తుపాకీ కూడా కనిపించడం తీవ్ర కలకలం రేపింది.
స్థానికుల సహకారంతో పట్టుబడిన ఆ దొంగని విచారించేసరికి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్టీల్ ప్లాంట్ సెక్టర్లలో జరిగిన మూడు దోపిడీ కేసులను ఒప్పుకున్నాడు ఆ దొంగ అశోక్. ప్రాథమికంగా ఒప్పుకున్న కేసులతో.. అశోక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి డమ్మీ తుపాకీ కత్తితో పాటు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒంటరి మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.
అయితే, ఇంత పెద్ద టౌన్‌షిప్‌లో నిఘా వైఫల్యం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఒకవైపు స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీతో పాటు మరోవైపు పోలీసులు కూడా ఈ ప్రాంతం పై నిఘా అంతంత మాత్రమే కనిపిస్తోంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు మినహా.. మిగతా సమయంలో నిఘా కొరవడుతోంది. ఇదే నేరగాళ్లకు కలిసొస్తోంది. ఇప్పటికైనా పోలీసులు ఈ ప్రాంతాల్లో నిఘా పెంచి తమ భద్రతకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు స్థానికులు.