విజయవాడ, జూలై 30: వాహనం రోడ్డెక్కితే చాలు…ఖచ్చితంగా ఆ వాహనానికి సంబంధించిన పేపర్ లతో పాటు దాన్ని నడుతుపుతున్న వ్యక్తికి సంబంధించిన అన్ని పేపర్లు ఉండాలి.వాహనాలకైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్ సి) కార్డుతో పాటు పొల్యూషన్,ఇన్సూరెన్స్ వంటి పత్రాలు తప్పనిసరిగా వాహనంతో పాటు ఉండాలి.ఇక డ్రైవర్ లేదా ద్విచక్రవాహనదారులకైతే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే..ఈ కార్డులు, పత్రాలు గనుక లేకుంటే టెన్షన్ తప్పుదు మరి. ఎప్పుడు ఎక్కడ ఏ పోలీస్ అధికారి వాహనాన్ని ఆపుతారో…ఏ పేపర్లు అడుగుతారో అని టెన్షన్ ఉంటుంది.కొన్నిసార్లయితే అన్నీ ఉన్నప్పటికీ హడావుడిగా బయటకు వెళ్లిన సమయంలో ఇలాంటి అనుభవం ఎదురయితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.అందుకే ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.ఆర్ సి కార్డు,డ్రైవింగ్ లైసెన్స్ కార్డు లేకపోయినా జస్ట్ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలంటుంది.
శాఖలో అవకాశం ఉన్న చోట్ల డిజిటల్ విధానాన్ని ప్రోత్సహిస్తుంది రవాణా శాఖ.ఏదైనా వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్డు,సదరు వ్యక్తి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ను స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుందని చెబుతుంది.తనిఖీల్లో భాగంగా ఎవరైనా లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కార్డు అడిగితే స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకున్న డాక్యుమెంట్ చూపిస్తే సరిపోతుందని కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది.ఇప్పటివరకూ ఉన్న కార్డులతో పాటు భవిష్యత్తులో కార్డులు వాడే అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలని రవాణాశాఖ అధికారులు తెలిపారు.డిజి లాకర్,ఎం-పరివాహన్ లో ఇ-ఆర్సీ,ఇ-డీఎల్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.అయితే స్మార్ట్ ఫోన్ లు లేనివారు మాత్రం పేపర్ పై ప్రింట్ తీసుకుని జేబులో పెట్టుకోవాలని సూచించారు.
ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ కార్డులు,డ్రైవింగ్ లైసెన్స్ ల కోసం ప్లాస్టిక్ స్మార్ట్ కార్డులను రవాణా శాఖ జారీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని కారణాలతో రిజిస్ట్రేషన్ కార్డుల జారీ ఆలస్యం అవుతూ వస్తుంది..దీనికి తోడు ప్లాస్టిక్ వినియోగం అరికట్టడంతో పాటు ముఖ్యంగా వినియోగదారులు కార్డుల కోసం చెల్లించే రెండు వందల రూపాయిలతో పాటు సర్వీస్ చార్జి 35 రూపాయిలు ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. సో ఇకపై కార్డు లేదని.. ఇంకా రాలేదని అస్సలు వర్రీ వద్దంటున్నారు. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే వెంటనే ఆర్సీ, డీఎల్ డౌన్ లోడ్ చేసేసుకోండి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..