Land Registration: 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌.. జగన్ సర్కార్ నిర్ణయంతో వెంటనే భూముల మ్యుటేషన్‌..

Digitise property registrations in AP: ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్ట్రార్‌ ఆఫీసులో గంటల కొద్దీ వెయిట్‌ చేయాల్సిన పని లేదు. జస్ట్‌ 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ అయిపోతుంది. ఏపీలో రిజిస్ట్రేషన్ల కోసం కొత్త ఆన్‌లైన్‌ విధానాన్ని సర్కార్‌ ప్రవేశపెట్టింది. మధ్యవర్తులతో సంబంధం లేకుండా.. ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. అయితే దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బ తింటుందంటూ డాక్యుమెంట్‌ రైటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Land Registration: 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌.. జగన్ సర్కార్ నిర్ణయంతో వెంటనే భూముల మ్యుటేషన్‌..
YS Jagan

Updated on: Sep 01, 2023 | 9:37 PM

Digitise property registrations in AP: ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్ట్రార్‌ ఆఫీసులో గంటల కొద్దీ వెయిట్‌ చేయాల్సిన పని లేదు. జస్ట్‌ 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ అయిపోతుంది. ఏపీలో రిజిస్ట్రేషన్ల కోసం కొత్త ఆన్‌లైన్‌ విధానాన్ని సర్కార్‌ ప్రవేశపెట్టింది. మధ్యవర్తులతో సంబంధం లేకుండా.. ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. అయితే దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బ తింటుందంటూ డాక్యుమెంట్‌ రైటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్దాల నాటి రిజిస్ట్రేషన్‌ విధానానికి జగన్‌ సర్కార్‌ స్వస్తి చెప్పింది. దాని స్థానంలో కొత్త ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. రిజిస్ట్రేషన్ల శాఖలో CARD 1.0 స్థానంలో CARD 2.0 ను తీసుకొచ్చారు. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ చాలా సులువుగా ఉంటుందని.. కేవలం 20 నిమిషాల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు నేరుగా ఆన్‌లైన్‌లో దస్తావేజులు తయారు చేసుకునేలా కొత్త విధానాన్ని రూపొందించారు.

మధ్యవర్తులపై ఆధారపడకుండా ప్రజలు సులువుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. వినియోగదారులు తమ వివరాలను నేరుగా నమోదు చేసుకుని ఫీజు చెల్లించొచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తైన 20 నిమిషాల్లో దస్తావేజులు కూడా చేతికి వస్తాయి. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ఈ విధానం సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తున్నారు. ఈ నెల 15 కల్లా రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ విధానం అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌ లోనే మొత్తం ప్రక్రియ

ఆధార్ లింకుతో రిజిస్ట్రేషన్ ను అనుసంధానం చేయడం ద్వారా అసలు వ్యక్తులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదని అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఆధార్‌కార్డులో ఉన్న బయోమెట్రిక్ వివరాలతో సరిపోల్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈకేవైసీ కూడా పూర్తి చేస్తారు. ఈ విధానంలో రిజిస్ట్రేషన్ కోసం ముందుగా ఐజీఆర్ఎస్-ఆంధ్రప్రదేశ్ వెబ్ సైట్‌లోకి లాగిన్ కాగానే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసి రిజిస్ట్రేషన్ సైట్‌లోకి వెళ్లి ఆస్తుల వివరాలు, సర్వే నంబర్, లింక్ డాక్యుమెంట్‌ తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఆయా ఆస్తులకు సంబంధించి పూర్వ దస్తావేజులు స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి. ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జీల వివరాలు కూడా నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. క్రయ విక్రయాలకు సంబంధించిన వారి ఫొటోలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే తీస్తారు. దీంతో అక్రమాలకు చెక్ పెట్టవచ్చు.

రిజిస్ట్రేషన్‌ అవగానే మ్యుటేషన్‌

అయితే, ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంలో వినియోగదారులు ఎలాంటి దస్తావేజులను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని అధికారులు తెలిపారు. ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగానే వివరాలను పరిశీలించి క్లీయర్ చేస్తారు. ఆన్‌లైన్‌లో ఇచ్చిన స్లాట్ సమయానికి క్రయ, విక్రయాలకు సంబంధించిన వ్యక్తులు.. సాక్షులు రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ ఈ-సిగ్నేచర్ ద్వారా రిజిస్టేషన్ ప్రక్రియ 20 నిమిషాల్లో ముగుస్తుంది.

డాక్యుమెంట్‌ రైటర్ల ఆందోళన..

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే మ్యుటేషన్‌ జరిగేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకునే విధానం దీనిలోనే ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. ఈ-స్టాంప్‌ విధానం అమల్లోకి రావడంతో దశాబ్దాలుగా వాడుకలో ఉన్న నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంపు పత్రాల విక్రయాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. అయితే డాక్యుమెంట్‌ రైటర్లు ఈ కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల మోసాలు ఎక్కువగా జరుగుతాయని, తమకు ఉపాధి కూడా తగ్గుతుందని వాళ్లు వాదిస్తున్నారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో కాళ్లు నొప్పులు పుట్టేలా గంటల తరబడి వెయిట్‌ చేయకుండా సులభంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగిసేందుకు ప్రభుత్వం ఈ విధానం తీసుకొచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..