Cyclone Alert: ఏపీవైపు కదులుతున్న తుఫాన్.. అప్రమత్తమైన ప్రభుత్వం.. ఇవిగో లేటెస్ట్ అప్‌డేట్స్..
మొంథా తుఫాన్ ముంచుకొస్తుంటే....ఏపీ తీరం గుండెల్లో తుఫాన్ బెల్స్ మోగుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఏపీ తీరంవైపు కదులుతోంది. తీవ్ర తుఫాన్‌గా మారి ఎల్లుండి తీరం దాటే అవకాశం ఉంది. కళింగపట్నం -మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ చెబుతోంది. తీరం దాటే సమయంలో భీకర వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా బలపడుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదిలింది. ప్రస్తుతం ఇది చెన్నైకి దక్షిణ-తూర్పున 770 కి.మీ, విశాఖపట్నంకి 820 కి.మీ, కాకినాడకి 810 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాతావరణశాఖ తాజా నివేదికల ప్రకారం, ఈ తీవ్ర వాయుగుండం మరో 10 గంటల్లో తుపానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది.తుపాను నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతాల మీదుగా కదిలి, తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఇప్పటికే తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు మొదలయ్యే సూచనలు ఉన్నాయి.
సోమవారం: కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా.
Also Read: వాయుగుండాలు, తుఫాన్ తీవ్రత తెలియజేసేలా ప్రమాద హెచ్చరికలు.. ఏవి అత్యంత తీవ్రమైనవి..?
మంగళవారం: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏఎస్ఆర్, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కూడా భారీ వర్షాలు తేలికపాటి తుఫాను గాలులతో కూడి పడతాయని హెచ్చరించింది.
గాలి వేగం, సముద్ర పరిస్థితులు: తీరప్రాంతాల్లో గంటకు 60 నుండి 90 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం తీవ్రంగా అలముకునే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని అధికారు సూచించారు. తీరప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలి. విద్యుత్ వైర్లు, చెట్లు కూలే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక అధికారుల సూచనలను పాటించాలని సూచించారు.
ఈ తీవ్ర వాయుగుండం రాబోయే 24 గంటల్లో తుపానుగా మారి, తీరప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రెవెన్యూ, విపత్తు నిర్వహణ, విద్యుత్, మత్స్యశాఖలు సిబ్బందిని సన్నద్ధం చేశాయి.
