Cyclone Mandous: బీభత్సం సృష్టిస్తున్న మాండూస్.. 10 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం..
Cyclone Mandous: మాండూస్ తుపాన్ తమిళనాడుతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఈ తెల్లవారుజామున మహాబలిపురం దగ్గర తీరం దాటినా..తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది.
మాండూస్ తుపాన్ తమిళనాడుతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఈ తెల్లవారుజామున మహాబలిపురం దగ్గర తీరం దాటినా..తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పెనుగాలుల ధాటికి తీరంలో మత్స్యకారుల బోట్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు తుఫాన్ కారణంగా నలుగురు మృతి చెందారు.
చైన్నై సహా 10 జిల్లాలపై ఎఫెక్ట్..
చెన్నై సహా పది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురంతోపాటు పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. మరో 26 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతో పాటు పలు జిల్లాల్లో పెనుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. చెన్నైతోపాటు 5 ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
నేల కూలిన భారీ వృక్షాలు..
చెన్నైలో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. చెట్లు, గోడలు కూలి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చెన్నై సిటీలోనే 400లకు పైగా భారీ వృక్షాలు కూలినట్టు తెలుస్తోంది. తుఫాన్ ప్రభావంతో చెన్నై విమానాశ్రయం నుంచి అన్ని విమానాలు రద్దు చేశారు. మహాబలిపురం వెళ్లే ఈసీఆర్ రోడ్డులో ఆంక్షలు విధించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు.
ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం..
దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం తెలిపింది నిన్నటి నుంచి తిరుపతిలో వర్షం కురుస్తుండటంతో పలు విమానాలను రద్దు చేశారు.
కాగా, తుఫాన్ ప్రభావంతో ఇవాళ, రేపు తమిళనాడు, ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా తిరుపతి జిల్లాపై మాండూస్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వాకాడు మండలం తూపిలిపాలెం బీచ్ దగ్గర 10 మీటర్లు ముందుకొచ్చింది సముద్రం. చిట్టుమూరు మండలం తీర ప్రాంతంలోని పంబలి, మెట్టు, శ్రీనివాసపురం గ్రామాలకు రాక పొకలు బంద్ అయ్యాయి. చిట్టమూరు, చిల్లకూరు, వాకాడు, కోట మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. సముద్ర తీర ప్రాంతంలో శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. పంట పొలాలన్నీ నీట మునిగిపోయాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..