ఏపీ తీరంపై తుఫాను పంజా.. భారీ వర్షాలు, భీకర గాలుల హెచ్చరిక! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరంవైపు అతివేగంగా దూసుకొస్తోంది. తుఫాను తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 28న బాపట్ల–విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్–యానాం తీరాన్ని తుఫాను దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరంవైపు అతివేగంగా దూసుకొస్తోంది. తుఫాను తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 28న బాపట్ల–విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్–యానాం తీరాన్ని తుఫాను దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు రెడ్ మెసేజ్ హెచ్చరిక జారీ చేసింది.
అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
తుఫాను ముప్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలు, బలమైన గాలులు, వరద ప్రవాహాల ప్రభావాన్ని అంచనా వేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. గత తుఫానుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని, తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైనప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. సహాయక శిబిరాల్లో తాగునీరు, ఆహారం, మందులు, ఇతర అత్యవసర సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఆర్టీజీఎస్, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి. అవసరమైతే ముందుగానే పునరావాస కేంద్రాలకు వెళ్లాలి. అత్యవసర మందులు, తాగునీరు, పొడి ఆహారం, టార్చ్‌లైట్లు, బ్యాటరీలు, మొబైల్ ఛార్జర్లు, ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. బలమైన గాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, బలహీనమైన భవనాలకు దూరంగా ఉండాలి. తెగిపడిన విద్యుత్ తీగలను తాకకూడదు. వరదనీటిలో నడవడం, అనవసర ప్రయాణాలు చేయడం మానుకోవాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న పడవలు సురక్షిత తీరాలకు చేరుకోవాలని సూచించారు. బీచ్‌లు, రేవులు, సముద్రపు గట్ల వద్దకు వెళ్లకూడదని స్పష్టం చేశారు.
రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు సూచనలు
తుఫాను ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, మినుము, పెసర, కంది పంటలను వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు కోసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. ధాన్యం, పత్తి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు తడవకుండా టార్పాలిన్లతో కప్పి భద్రపరచుకోవాలని సూచించారు. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువలను శుభ్రం చేయాలి. భారీ వర్షాల సమయంలో వరి పైరుకు యూరియా, ఇతర ఎరువుల పైపూత వేయడాన్ని వాయిదా వేయాలని మంత్రి తెలిపారు. మిరప, టమాటా, వంగ, బెండ వంటి కూరగాయల పంటల్లో నీటి పారుదల సక్రమంగా ఉండేలా చూడాలని, అరటి, బొప్పాయి వంటి పంటలకు మద్దతు కర్రలు ఏర్పాటు చేయాలని సూచించారు. పంటలకు పురుగుమందుల పిచికారీని వర్షాలు తగ్గే వరకు వాయిదా వేయాలని, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకే తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు.
పంటల కంటే ప్రాణాలే ముఖ్యం
తుఫాను కారణంగా పంటలు, పశువులు, కోళ్ల షెడ్లు, వ్యవసాయ పరికరాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు కోళ్ల షెడ్లు, వ్యవసాయ యంత్రాలను రక్షించుకోవాలి. తుఫాను అనంతరం పంట నష్టాన్ని అంచనా వేసి, అవసరమైన ఫొటోలు, పత్రాలను భద్రపరచుకోవాలని తెలిపారు. భారత వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా యంత్రాంగం జారీ చేసే అధికారిక హెచ్చరికలను మాత్రమే నమ్మాలని, వదంతులను పట్టించుకోవద్దని సూచించారు.
తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పంటలను, ఆస్తులను కాపాడుకునే ప్రయత్నంలో ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దు. ప్రాణరక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అర్నబ్ తుఫాను అక్టోబర్ 28 ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. గాలి వేగం, వర్షపాతం అంచనాలు మారవచ్చు కాబట్టి తాజా అధికారిక హెచ్చరికలను అనుసరించాలని అదికారులు పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
