Andhra News: పెద్దావిడకు ఫోన్ చేసి ఆ మాట చెప్పగానే 53 లక్షలు పంపింది.. కొన్ని రోజుల తర్వాత
మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి...? ఎవరో ఏదో చెప్తే నమ్మేస్తారా..? అస్సలు వర్రీ అవ్వొద్దు. అసలు పోలీసులు మిమ్మల్ని ఫోన్‌లో డబ్బులు ఎందుకు అడుగుతారు మీ వెర్రితనం కాకపోతే. పాపం ఈ పెద్దావిడ ఇలాంటి మోసాల గురించి తెలియక.. ఏకంగా 50 లక్షలకు పైగా పోగొట్టుకుంది.

కర్నూలులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రిటైర్ అయ్యి భర్త చనిపోయి పిల్లలు లేక ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎస్ఐ పేరుతో ఫోన్ కాల్ వచ్చింది. అక్రమ డబ్బు, నకిలీ నోట్ల కేసులో ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు సైబర్ నేరగాడు ఫోన్‌లో తెలిపాడు. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు పంపించాలని హెచ్చరించాడు. భయపడిన మహిళ 2024 నవంబర్ 23న సైబర్ నేరగాడు చెప్పిన అకౌంట్‌కి 45 లక్షలు, మరోసారి హెచ్చరించడంతో అదే నెల 28న మరో ఎనిమిదిన్నర లక్షలు అతను చెప్పిన ఖాతాకు పంపించింది. 2017లో రిటైర్ అయ్యి పెద్ద మార్కెట్ దగ్గర అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటున్న హేమంత్ కుమారి.. ఇటీవల తన బంధువులతో ఈ విషయం చెప్పడంతో అవాక్కయ్యారు. వెంటనే వెళ్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు.. సైబర్ నేరగాళ్ల అకౌంట్ కోల్‌కతా చిరునామాతో ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి బెదిరింపులకు ఎవరు భయపడవద్దని తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.
డిజిటల్ అరెస్ట్‌లు కేవలం ఆడియో కాల్స్ మాత్రమే కాదు.. వీడియో కాల్స్ ద్వారా కూడా జరుగుతుంటాయి. ఒక్కోసారి ఒక్కో టైప్‌లో మోసం జరుగుతుంటుంది. పైగా ప్రజలకు కూడా పూర్తి అవగాహన ఉండి తీరాల్సిన అంశం ఇది. వీడియో కాల్‌లో బెదిరించేవాళ్లు సాధారణ వ్యక్తుల్లా, అల్లాటప్పాగా ఉంటారనుకుంటే పొరపాటే. తాము పోలీసులం అంటారు, సీబీఐ అధికారులమని చెబుతారు. లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, ఈడీ ఆఫీసర్స్ అని చెప్పుకుంటారు. ఆ వీడియో కాల్ చేసే వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే, అది నిజమైన పోలీస్ స్టేషనే లేదా సీబీఐ ఆఫీసే అనిపించేంతగా సెట్టింగ్ వేస్తారు. యూనిఫామ్స్ వేసుకుంటారు, ఐడీలు పెట్టుకుంటారు, పక్కనే ఇండియన్ ఫ్లాగ్ పెట్టి, టేబుల్ మీద నాలుగు సింహాల బొమ్మపెట్టి, నకిలీ ఐడీ కార్డులు చూపిస్తుంటారు.
పోలీసులం అని చెప్పి, సీబీఐ-ఈడీ అధికారులం అంటూ ఎవరైనా కాల్ చేస్తే అస్సలు భయపడొద్దని స్వయంగా ప్రధానే చెప్పారు. ఒక్కక్షణం వివేకంతో ఆలోచించాలి తప్పితే.. వాళ్లు అడిగిన సమాచారం అంతా ఇవ్వకూడదన్నారు. అనుమానం వచ్చిన వెంటనే కాల్ కట్ చేయడమో, ఇంట్లోని వాళ్లకు చెప్పడమో చేయాలని, ఆ తరువాత పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పారు. మరో ప్రధానమైన విషయం కూడా చెప్పారు ప్రధాని మోదీ. సాధారణంగా ప్రభుత్వ అధికారులు గానీ, సంస్థలు గానీ.. వీడియో కాల్ చేసి బెదిరించటం, భయపెట్టటం, విచారణ చేయడం జరగదు అన్నారు. చట్టం అందుకు ఒప్పుకోదన్నారు. సో, కాల్ చేసి బెదిరిస్తున్నారంటే అది కచ్చితంగా ఫ్రాడ్ అని గుర్తుపెట్టుకోవాలన్నారు. అవసరమైతే.. పోలీస్ స్టేషన్‌కే వస్తామని ఎదురు చెప్పాలని సలహా ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




