Godavari Floods : మళ్లీ ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద పెరుగుతున్న నీటి మట్టం
Godavari Floods 2022: ఒకవైపు నాన్ స్టాప్ రెయిన్స్..మరోవైపు పై నుంచి పోటెత్తుతున్న వరదతో గోదారమ్మ మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పరివాహక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి.దీంతో లోతట్టు ప్రాంతాల..
గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు..ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతోంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. అటు బాసర దగ్గర శివలింగాలను అభిషేకిస్తూ పరుగులు పెడుతోంది గోదారమ్మ.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర కూడా వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.36 లక్షల క్యూసెక్కులు పైగా నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అధికారులు. ఇవాళ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది.
మరోవైపు చింతూరు దగ్గర 32 అడుగులు దాటింది శబరి నీటిమట్టం. అటు విశాఖ ఏవోబీలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. సీలేరు, శబరి నదులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. మోటు-తిప్పాపురం హైవే మీద వరదనీరు ప్రవహిస్తోంది. ఏపీ-ఒడిశా-ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలకు అంతరాయమేర్పడింది.
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలను వణికిస్తున్నాయి జోరు వానలు. ప్రాణహిత, ఇంద్రావతి నుంచి వరద పోటెత్తుతోంది. వరంగల్-ఏటూరు నాగారం మధ్య కటాక్షపూర్ దగ్గర జాతీయరహదారిపై పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిత్యావసరాల కోసం ప్రమాదకరంగా మారిన వాగులను దాటాల్సిన పరిస్థితి. పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొమురంభీం జిల్లాలో కుండపోత వానలకు కాగజ్‌నగర్ మండలంలోని అందవెల్లి బ్రిడ్జ్ మరింత కుంగింది. గత నెలలోనే ప్రమాదకర స్థితికి చేరిన వంతెన..ఇప్పుడు మరింత కుంగింది. నెల రోజులుగా దహేగాం – కాగజ్ నగర్ మండలాల మధ్య వాహనాలను నిలిపివేశారు అధికారులు. అయినా స్థానికులు కాలినడకన రాకపోకలు సాగిస్తున్నారు.
ములుగు జిల్లాలో భారీ వర్షాలకు బొగత జలపాతానికి వరద పోటెత్తింది. జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సమీప ప్రాంతాలు జలమయమయ్యాయి.పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో పర్యాటకులకు నోఎంట్రీ బోర్డ్ పెట్టారు.
4 రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు తోడు..ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.