AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: వైజాగ్‌కు మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు

అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖ ఐటీ హబ్‌ను బలోపేతం చేయడానికి రూ. 1500 కోట్ల పెట్టుబడితో మెగా టెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇందుకుగానూ సదరు కంపెనీకి 22 ఎకరాలు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక రాయితీగా ఎకరానికి 99 పైసలు మాత్రమే తీసుకోనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 8000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

Vizag: వైజాగ్‌కు మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు
Vizag
Eswar Chennupalli
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 19, 2025 | 4:27 PM

Share

విశాఖ నగరం ఐటీ రంగంలో మరో మెట్టు ఎక్కనుంది. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్ ఇప్పుడు విశాఖను తన తదుపరి గమ్యంగా ఎంచుకుంది. విశాఖలో ఐటీ హబ్‌ను మరింత బలోపేతం చేయడానికి కాగ్నిజెంట్ సంస్థ రూ. 1500 కోట్ల పెట్టుబడితో ఒక మెగా టెక్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 8000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనా. ఇది విశాఖ ఐటీ రంగానికి తిరుగులేని బలం కలిగించనుంది.

ఐటీ హిల్స్‌లో 22 ఎకరాలు – ఎకరానికి 99 పైసలు

ప్రాజెక్ట్‌ను వేగంగా అమలు చేసే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ ఐటీ హిల్స్‌లో 22 ఎకరాల భూమిని కాగ్నిజెంట్‌కు కేటాయించేందుకు అంగీకరించింది. ఇది సాధారణ ధరలకు కాదు – ప్రోత్సాహక ధరగా ఎకరానికి 99 పైసలే వసూలు చేయనుంది. ఇది ఐటీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం.

ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం

ఈ ప్రతిపాదనతో పాటు మొత్తం 19 కంపెనీల పెట్టుబడుల అంశాలు ప్రభుత్వం ముందుకు వచ్చాయి. ఇవన్నీ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆమోదించారు. SIPBకు వచ్చిన ప్రతిపాదనల విలువ రూ. 28,546 కోట్లు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 30,270 మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అంచనా.

వేగంగా అనుమతులు

రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు ఎంతో కీలకం కావడంతో, ప్రతీ సంస్థ ప్రతిపాదనను వేగంగా పరిశీలించి అవసరమైన అనుమతులు వెంటనే జారీ చేయాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగావకాశాలు కల్పించేవి ప్రాధాన్యతతో పరిశీలించండి అని ఆయన తేల్చిచెప్పారు.

విశాఖ – ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ ముఖద్వారం

ఈ పెట్టుబడులు, ప్రభుత్వ ప్రోత్సాహం, నాయకత్వ స్థాయిలో తీసుకునే నిర్ణయాలు చూస్తే విశాఖపట్నం త్వరలోనే దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన ఐటీ డెస్టినేషన్‌గా మారనుందనీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగ్నిజెంట్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడం అనేది ఈ మార్గాన్ని మరింత దృఢంగా నిర్ధారిస్తోందన్నది ప్రభుత్వ వర్గాల విశ్లేషణ.

Cognizant

Cognizant

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..