AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: నెరవేరబోతున్న దశాబ్దాల కల.. పులికాట్‌ సరస్సులో పూడికతీత పనులకు భూమిపూజ చేయనున్న సీఎం జగన్..

Pulicat Lake dredging works: దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న పులికాట్‌ సరస్సుకు మోక్షం లభించనుంది. సరస్సులో పూడిక తీత పనులకు సీఎం జగన్‌ నేడు భూమిపూజ చేయనున్నారు. ఈ పనులు పూర్తయితే వేలసంఖ్యలో మత్స్యకారులకు ఉపాధి లభించడంతో పాటు..పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం చెబుతోంది.

YS Jagan: నెరవేరబోతున్న దశాబ్దాల కల.. పులికాట్‌ సరస్సులో పూడికతీత పనులకు భూమిపూజ చేయనున్న సీఎం జగన్..
Ys Jagan
Ch Murali
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 21, 2023 | 2:20 PM

Share

Pulicat Lake dredging work: సూళ్లూరుపేట మత్స్యకారుల దశాబ్దాల కల సాకారం కాబోతోంది. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీత పనులకు..సీఎం జగన్‌ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనులకు ప్రభుత్వం 122 కోట్ల రూపాయలను కేటాయించింది. అలాగే కాళంగి నదిపై 35 కోట్లతో చేపట్టిన నూతన బ్రిడ్జి నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులను కూడా సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. దేశంలో జీవవైవిధ్యాన్ని సంతరించుకున్న రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్‌ సరస్సు. మంచినీళ్లు, ఉప్పునీళ్లు కలగలసి 45 శాతం సైలెనిటీ కలిగి ఉండడంతో ఇక్కడ మత్స్యసంపద సమృద్ధిగా దొరికేది. పులికాట్ మొత్తం విస్తీర్ణం 640 చదరపు కిలోమీటర్లు కాగా అందులో 84 శాతం ఏపీలోనూ, 16 శాతం తమిళనాడులోను ఉంది. అయితే భూభాగం ఏపీలో అధికంగా ఉన్నా.. నీటి శాతం మాత్రం తమిళనాడులో ఎక్కువగా ఉంది. అయితే పూడిక కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా సముద్రం నుంచి ఉప్పునీరు రావడం తగ్గిపోవడంతో.. మత్స్య సంపద కూడా తగ్గుతూ వస్తోంది. గత పదేళ్లతో పోల్చుకుంటే సరస్సులో మత్స్యసంపద బాగా తగ్గింది.

అయితే, తమిళనాడు తీరంలో ఉండే ముఖద్వారాల్లో అక్కడి ప్రభుత్వం ఏటా పూడిక తీయిస్తోంది. దీంతో అక్కడ నీటి సామర్ధ్యం ఉంటోంది. కానీ ఏపీలో మాత్రం పూడికతీత పనులు జరగడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇదొక ఎన్నికల ప్రచారాస్త్రంగా మారుతోందే తప్ప..పరిష్కారం మాత్రం లేదు. దీనిపై టీవీ9 అనేక కథనాలను కూడా ప్రసారం చేసింది. గత ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూడిక తీత చేపడతామని గతంలో జగన్‌ హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పుడు ఆచరణలోకి రాబోతోంది.

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ముఖద్వారాల పూడిక తీత పూర్తయితే రాష్ట్ర ప్రరిధిలోని పులికాట్ భూభాగంలో నీరు పుష్కలంగా ఉంటుంది. తద్వారా మత్స్య సంపద పెరిగి..మత్స్యకార కుటుంబాలకు ఉపాధి పెరుగుతుంది. అలాగే పులికాట్‌ సరస్సు ఎల్లప్పుడూ జలంతో కళకళలాడుతూ ఈ ప్రాంత పక్షుల భూతల స్వర్గంగా విరాజిల్లే అవకాశం ఉంది. తద్వారా ఈ ప్రాంతం పర్యాటకపరంగా కూడా అభివృద్ధి చెందుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..