AP News: సేమ్ డేట్.. సేమ్ ప్లేస్.. ఒకే రోజు సీఎం జగన్, చంద్రబాబు ప్రచారం..
ఏపీలో పొలిటికల్ హీట్ మొదలుకాబోతోంది. మార్చి 27న ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుండటమే ఇందుకు అసలు కారణం. ఈ ఇద్దరు నేతలు రాయలసీమ నుంచి.. అది తమ సొంత జిల్లాల నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టడం మరో విశేషం.
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసిన ప్రధాన పార్టీలు.. ఇక ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో ఎల్లుండి నుంచి సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో దూసుకుపోయేందుకు సిద్ధమవుతున్నారు. షెడ్యూల్ విడుదల తరువాత ఇద్దరు ముఖ్యనేతలు ఒకే రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుండటంతో.. ఏపీలో రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే సిద్ధం సభలతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన సీఎం జగన్.. ఎల్లుండి నుంచి మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఈ యాత్ర కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమై ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతుంది. 27న ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. 28న నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖి కానున్న సీఎం జగన్.. సాయంత్రం నంద్యాలలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. 29న కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించనున్న సభలో సీఎం జగన్ పాల్గొంటారు.
ఇక ఈ నెల 27 నుంచే చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. 31 వరకు ఆయన పర్యటనలు కొనసాగుతాయి. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు. ఇక మార్చి 25, 26 సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు చంద్రబాబు. సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరూ రాయలసీమ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం ఆసక్తిరేపుతోంది. సొంత జిల్లాల ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఇద్దరు నేతలు.. మార్చి 29న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకేసారి పర్యటించనున్నారు.