AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీలో పొలిటికల్ ‘తీన్’మార్.. ప్రధాన నేతల పర్యటనల షెడ్యూల్ ఫిక్స్.. పూర్తి వివరాలు..

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ నెల 27 నుంచి సీఎం జగన్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 27 నుంచి రా కదలిరా రెండో షెడ్యూల్‌ రెడీ చేసుకున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. నెలాఖరులో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌.

AP News: ఏపీలో పొలిటికల్ 'తీన్'మార్.. ప్రధాన నేతల పర్యటనల షెడ్యూల్ ఫిక్స్.. పూర్తి వివరాలు..
Ap Politics
Ravi Kiran
|

Updated on: Jan 25, 2024 | 7:30 AM

Share

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ నెల 27 నుంచి సీఎం జగన్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 27 నుంచి రా కదలిరా రెండో షెడ్యూల్‌ రెడీ చేసుకున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. నెలాఖరులో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌.

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల నేతలంతా పర్యటనల షెడ్యూళ్లు ఫిక్స్‌ చేసుకున్నారు. వై నాట్ 175 అని టార్గెట్‌ పెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే గత నెల రోజులుగా నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌ల మార్పులపై దృష్టి పెట్టారు. త్వరలో చివరి విడత జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్నారు. మిగిలిన స్థానాల్లో కూడా ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పులను ఈ నెల 27 నాటికి పూర్తి చేయాలని జగన్‌ భావిస్తున్నారు. మొత్తం అభ్యర్థుల ఎంపిక తర్వాత ప్రజల్లోకి వెళ్లనున్నారు సీఎం జగన్. ఇప్పటివరకూ సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి.. ఈ నెల 27 నుంచి రాజకీయ సభలు పెట్టేలా ప్రణాళిక రూపొందించారు.

ఈ నెల 27 లోగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ నెల 27 న ఉత్తరాంధ్ర లోని భీమిలిలో మొదటి బహిరంగ సభలో పాల్గొంటారు జగన్‌. మొత్తం 26 జిల్లాలకు కలిపి అయిదు చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు.ఫిబ్రవరి 10 వ తేదీ లోగా అన్ని సభలను పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీ కేడర్ కీలక పాత్ర పోషిస్తారు. అందుకే కేడర్ తో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. పార్టీ అభ్యర్థుల మార్పు ఎందుకు చేయాల్సి వచ్చింది…ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి…వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఏం చేయాలి..కేడర్ క్రియాశీలత వంటి అంశాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇలా చేయడం ద్వారా కొత్తగా నియమించిన ఇంచార్జి లకు కేడర్ నుంచి మంచి సహకారం అందుతుందని భావిస్తున్నారు.

ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు రా కదలిరా రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. 27, 28, 29న ఆరు నియోజకవర్గాల్లో సభలుంటాయి. 27న పీలేరు, ఉరవకొండ, 28న నెల్లూరు రూరల్, పత్తికొండ, 29న రాజమండ్రి రూరల్, పొన్నూరులో చంద్రబాబు సభలుంటాయి. అలాగే ఈ నెలాఖరు నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలుంటాయి. రోజుకి మూడు సభల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 5 జోన్లుగా విభజించుకుని ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జోన్ 1, రాయలసీమ జోన్ 2గా విభజించారు. ఎన్నికల కార్యక్రమాల కోసం 191 మందితో కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు మూడేసి చొప్పున సభలలో పాల్గొంటారు పవన్. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు రూపొందించారు.

అటు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యాటనలకు శ్రీకారం చుట్టారు. వైఎస్ షర్మిల చేపట్టిన జిల్లాల పర్యటన ఈ నెల 23 నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమై..ఈ నెల 31న కడప జిల్లాలో ముగుస్తుంది. తొలిరోజున శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో షర్మిల పర్యటించారు. బుధవారం విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో స్థానిక నేతలతో సంప్రదింపులు జరిపారు. గురువారం కాకినాడ, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు.. 26న తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు.. 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు.. 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు.. 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు.. 30న శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు.. 31వ తేదీన నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో షర్మిల పర్యటన కొనసాగుతుంది. ఇడుపులపాయతో షర్మిల పర్యటన ముగుస్తుంది. ఈ పర్యటనలో జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తారు షర్మిల. ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై చర్చిస్తారు.