CM Jagan: జనంలో జగన్.. క్యాడర్‌లో జోష్.. 8వ రోజు బస్సు యాత్ర హైలెట్స్
తిరుపతి జిల్లా పరిధిలో గురువారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగింది. మరో చారిత్రక విజయం దక్కించుకోవడం కోసం సిద్ధమా? అని నాయుడుపేట ప్రజా ప్రభంజనంను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. గత 58 నెలల్లో మీ బిడ్డ వేసిన అభివృద్ధి, సంక్షేమ విత్తనాలు రాబోయే రోజుల్లో చూస్తారని సీఎం పేర్కొన్నారు.
నడినెత్తిన నిప్పుల కురిపిస్తున్న భానుడితో పోటీ పడి సాగుతోంది.. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగిన 8వ రోజు యాత్రకు కూడా జన కేరటం పోటెత్తింది. వైసీపీ అధినేతకు అడగడుగునా అపూర్వ స్వాగతం లభించింది.
8వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర రాత్రి బస చేసిన గురవరాజుపల్లె నుంచి ప్రారంభమయింది. గురవరాజుపల్లెలో సీఎం జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదలారు జగన్. ఈ సందర్భంగా మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మల్లవరం మీదుగా ఏర్పేడు బయల్దేరింది బస్సుయాత్ర. తనను కలిసి ఫోటో దిగేందుకు పరిగెట్టి వస్తున్న అభిమానిని పిలిచి జగన్ సెల్ఫీ ఇచ్చారు. ఏర్పాడు మండలం ఇసుక తాగేలివద్ద మహిళలతో మాట్లాడారు. అనంతరం ఏర్పేడు చేరుకున్న యాత్రకు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఎద్దుల చెరువు వద్ద సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి వైసీపీలో చేరారు. ఆయనతో పాటు అనుచరులు, టీడీపీ కార్యకర్తలు వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019లో నెల్లూరుజిల్లా కావలి నుంచి టీడీపీ తరపున పోటీ చేశారు విష్ణువర్ధన్‌రెడ్డి. పనగల్లు మీదుగా శ్రీకాళహస్తి బైపాస్‌కు వైసీపీ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. మండుటెండలోనూ శ్రీకాళహస్తిలో రోడ్డుకిరువైపులా బస్సుయాత్రలో సీఎం జగన్‌కు మహిళలు ఘనస్వాగతం పలికారు.
చిన్న సింగమల సమీపంలో లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖముఖిలో పాల్గొన్నారు జగన్. ఓ టిప్పర్ డ్రైవర్‌కు సీటు ఇస్తే చంద్రబాబు అవహేళన చేస్తున్నారని..టిప్పర్ డ్రైవర్‌ను చట్ట సభలో కూర్చోబెడితే తప్పా అని జగన్ ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా ఆటో, ట్యాక్సీ, టిప్పర్ డ్రైవర్లకు అండగా ఉంటున్నామన్నారు. కోట్ల రూపాయాలు ఉన్నవారికే చంద్రబాబు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. సీఎంతో ముఖాముఖిలో తమ అంతరంగాన్ని, సమస్యలను వివరించారు డ్రైవర్లు.
ఆటో డ్రైవర్లతో ముఖాముఖి అనంతరం చావలి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. చావలిలో జగన్ బస్సుయాత్రకు ఘన స్వాగతం లభించింది. చావలిలో భోజన విరామం అనంతరం బయల్దేరిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు చిల్లకూరులో ఆత్మీయ స్వాగతం లభించింది. పూలవర్షం, గజమాలతో స్థానికులు జగన్‌కు ఘన స్వాగతం చెప్పారు. సాయంత్రం బస్సుయాత్ర నాయుడపేట చేరుకుంది. నాయుడుపేటలోని చెన్నై జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించారు.
బహిరంగ సభ తర్వాత ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్ , మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెం చేరుకున్నారు జగన్. చింతరెడ్డి పాలెంలో రాత్రి బస చేస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి