‘వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాలి’.. ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తొలి ప్రసంగం..

అయ్యన్నపాత్రుడు ఎప్పటికీ ఫైర్ బ్రాండ్ అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అంకితభావం విషయంలో అయ్యన్న పాత్రుడు కరుడుగట్టిన పసుపు సైనికుడు అని కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలుగా ఎంపికైన అభ్యర్థులతో ప్రమాణస్వీకారం చేయించారు ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి.

వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాలి.. ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తొలి ప్రసంగం..
Cm Chandrababu

Updated on: Jun 22, 2024 | 2:54 PM

అయ్యన్నపాత్రుడు ఎప్పటికీ ఫైర్ బ్రాండ్ అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అంకితభావం విషయంలో అయ్యన్న పాత్రుడు కరుడుగట్టిన పసుపు సైనికుడు అని కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలుగా ఎంపికైన అభ్యర్థులతో ప్రమాణస్వీకారం చేయించారు ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి. అనంతరం స్పీకర్ గా సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్న అయ్యన్న పాత్రుడిని సభలోని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడిగురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని కన్నతల్లిగా భావిస్తూ 43ఏళ్లుగా నిక్కచ్చిగా రాజకీయాలు చేశారన్నారు.

మచ్చలేని అయ్యన్నపాత్రుడిపై గత 5ఏళ్లలో అత్యాచారం సహా పదుల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టారని గత అనుభవాలను గుర్తు చేశారు. అయినా దేనికీ భయపడకుండా ధైర్యంగా పోరాడి ప్రజల్లో గెలిచి అసెంబ్లీకి వచ్చారని కీర్తించారు. గౌరవ శాసనసభను గత ప్రభుత్వం అగౌరవ పరిచిందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. బూతులు తిట్టేందుకు, వ్యక్తిత్వ హననం చేసేందుకు, అవమానాలు, దాడులకు వేదికగా నాటి సభ నిలిచిందని అన్నారు.తనను, తన కుటుంబ సభ్యుల్ని ఎంతో అవమానించినా కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మళ్లీ ముఖ్యమంత్రిగా గౌరవ సభకు వస్తానని శపథం చేసి బయటకు వెళ్లిపోయానన్న విషయాన్ని మరోసారి నిండు సభలో ప్రస్తావిచారు.

2019ఎన్నికల ఫలితాలపై దేవుడి స్క్రిప్ట్ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏవేవో లెక్కలు చెప్పారన్నారు. కానీ ఈ ఎన్నికల్లో కూటమికి వచ్చిన సీట్లు 11 అని ఒక లెక్క చెప్పారు. అమరావతి రాజధాని రైతుల ఉద్యమం 1631 రోజులు నడిచిందని. వాటిని సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడితే (1+6+3+1) 11 నంబర్ వస్తుందన్నారు. అలాగే జనసేన అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‎ను నాడు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు. కానీ ఆయనతో సహా జనసేన పార్టీ సభ్యులు 21స్థానాల్లో పోటీ చేస్తే 21స్థానాల్లోనూ అభ్యర్థులు గెలిచి చూపించారని చెప్పారు.

ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గి చూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని పొగడ్తల వర్షం కురిపించారు. వికసిత్ భారత్ అనేది ప్రధాని నరేంద్ర మోదీ కల అయితే వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాలన్నారు. రాష్ట్రాన్ని నిరుపేద రహిత ఆంధ్రప్రదేశ్‎గా తీర్చిదిద్దేదుకు అంతా కలసి కట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నాటి శాసనసభలో ఆడబిడ్డల వ్యక్తిత్వ హననం తనను ఎంతో బాధించిందన్నారు. అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా గౌరవ సభ నడుపుకుందామని చెప్పారు. ప్రజలు కూడా తమకు జరిగిన అన్యాయాన్ని గ్రహించి గౌరవ సభకు పంపారని వివరించారు. అందుకే వారి నమ్మకాన్ని కాపాడుతూ, ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత సభపై ఉందన్నారు. ప్రజలు ఇప్పటికే వైసీపీను శిక్షించారని.. ఆ పార్టీని ఇక వెక్కిరించాల్సిన అవసరం తమకు లేదన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..