ఏపీలో భయపెడుతున్న కొత్త రకం వ్యాధి.. అప్రమత్తమైన సర్కార్.. అధికారులతో సీఎం సమీక్ష
మూడేళ్ల కిందట ఢిల్లీ, తమిళనాడును షేక్ చేసిన స్క్రబ్ టైఫస్ జ్వరాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెన్షన్ పెడుతున్నాయి. నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ వ్యాధి ఎంత సీరియస్, ముదిరితే ఏమవుతుంది? డాక్టర్లు ఏమంటున్నారు?

మూడేళ్ల కిందట ఢిల్లీ, తమిళనాడును షేక్ చేసిన స్క్రబ్ టైఫస్ జ్వరాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెన్షన్ పెడుతున్నాయి. నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ వ్యాధి ఎంత సీరియస్, ముదిరితే ఏమవుతుంది? డాక్టర్లు ఏమంటున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయపెడుతున్న కొత్త రకం వ్యాధి.. పేరు స్క్రబ్ టైఫస్. ఇప్పటికే విజయనగరానికి చెందిన ఓ మహిళను ఈ మాయదారి బ్యాక్టీరియా బలి తీసుకుంది. నల్లిని పోలిన ఓ కీటకం కుట్టడంతో ఈ వ్యాధి వస్తుంది. శరీరంపై ఒకచోట దద్దుర్లొచ్చి, దానిపై నల్లటి మచ్చ ఏర్పడితే కచ్చితంగా అది స్క్రబ్ టైఫస్ లక్షణంగా భావించాలి. మొదట్లో తీవ్ర జ్వరం, వాంతులు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, పొడి దగ్గు లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగితే మెదడు, ఊపిరితిత్తులు, గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. కానీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు.
ముఖ్యంగా ఎలుకలు సంచరించే ప్రాంతాలు, పొలాలు, పొదలు, గడ్డివాములు ఉండే చోట్ల ఈ బ్యాక్టీరియా ఆనవాళ్లుంటాయి. ఇళ్లల్లో పాత మంచాలు, పరుపులు, దిండ్లలోకి చొరబడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్క్రబ్ టైఫస్ బారిన పడి చందక రాజేశ్వరి మృతి చెందిన తరహా ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యాధితో పాటు, ప్రమాదాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనేదానిపై ప్రజలకు వివరించాలన్నారు.
ఓరింటియా సుసుగాముషి అనే బాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది అంటువ్యాధి కాదని అధికారులు స్పష్టం చేశారు. సకాలంలో చికిత్స అందిస్తే, ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. స్క్రబ్ టైఫస్ వంటి వ్యాధి పట్ల ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అధికారులు చూడాలన్నారు. ఏవైనా కీటకాలు కుట్టిన వెంటనే పరీక్షలు చేయించేలా చూడాలని… వ్యాధి తీవ్రత పెరగకముందే అవసరమైన చికిత్స అందించేలా వైద్యారోగ్య శాఖ సిద్దంగా ఉండాలని సీఎం సూచించారు. చిన్న చిన్న కీటకాలు కుడితే మృత్యువాత పడే స్థాయికి పరిస్థితి రాకూడదని.. పూర్తిస్థాయిలో అవగాహన పెంచడమే దీనికి సరైన మార్గమని ముఖ్యమంత్రి చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
