AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అయ్యో దేవుడా.. కాలు విరిగి బురదలో అల్లాడిన ఏనుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

చిత్తూరు జిల్లాలో ఓ ఒంటరి ఏనుగు బురదలో చిక్కుకొని నరకయాతన అనుభవించింది. తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి యాదమరి మండలం కమ్మపల్లి అటవీ ప్రాంతంలోకి ఎంట్రీ ఇచ్చిన ఒంటరి ఏనుగు దాహం తీర్చుకునే ప్రయత్నం చేసి కష్టాల్లో పడింది. విషయం తెలుసుకున్న అటవిశాఖ అధికారులు 15 గంటల పాటు శ్రమించి ఏనుగు క్షేమంగా బటయకు తెచ్చారు.

Watch: అయ్యో దేవుడా.. కాలు విరిగి బురదలో అల్లాడిన ఏనుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Elephant Rescue
Raju M P R
| Edited By: Anand T|

Updated on: Dec 01, 2025 | 11:06 AM

Share

నీళ్లు తాగేందుకు చెరువలో దిగిన ఓ ఒంటరి ఏనుగు బురదలో ఇరుక్కొని నరకయాతన అనుభవించిన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి యాదమరి మండలం కమ్మపల్లి అటవీ ప్రాంతంలోకి ఎంట్రీ ఇచ్చిన ఒంటరి ఏనుగు దాహం తీర్చుకునే ప్రయత్నం చేసి కష్టాల్లో పడింది. అప్పటికే కుడికాలు దెబ్బతిన్న ఏనుగు యాదమరి మండలం గుడ్డివాని చెరువులోకి దిగింది. చెరువులో నుంచి బయటకు రాలేక బురదలోనే కురుకుపోయింది. శనివారం రాత్రి ఏనుగు ఘీంకర్యాలు విన్న స్థానికులు.. ఘటనా స్థలానికి వెళ్లి ఏనుగును పరిశీలించారు. అనంతరం అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

దీంతో అటవీ శాఖ సిబ్బంది, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని.. ఏనుగును కాపాడేందుకు ప్రయత్నించారు. కదలలేని పరిస్థితుల్లో ఏనుగు ఉండడంతో సిబ్బంది చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. దీంతో అతను పలమనేరు సమీపంలోని ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపు నుంచి కృష్ణ అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగులను మావాటిలను రప్పించారు. దాంతో పాటు క్రేన్లను కూడా సిద్ధం చేసిన జిల్లా అటవీశాఖాధికారులు తిరుపతి ఎస్వీ వైద్యులను కూడా రప్పించారు. డాక్టర్ అరుణ్, తోయిబా సింగ్ పర్యవేక్షణలో గాయపడ్డ ఏనుగును రెస్క్యూ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు.

కుంకీ ఏనుగుల సాయంతో ఒంటరి ఏనుగును బయటకు రప్పించేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే ఏనుగు కుడికాలు విరిగి ఉంటుందని భావించిన జూ వైద్యులు మత్తు ఇంజక్షన్ ఇచ్చి రెస్క్యూ చర్యలు చేపట్టారు. ఏనుగు నడుముకు బెల్టు కట్టి ప్రోక్లైన్, కుంకీ ఏనుగుల సాయంతో ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశారు. దాదాపు 15 గంటల పాటు ఆపరేషన్ గజ నిర్వహించిన అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఎట్టకేలకు ఒంటరి ఏనుగును సేఫ్ చేశారు. ఏనుగు కుడికాలు దెబ్బ తగిలినట్లు గుర్తించి లారీలో తిరుపతి ఎస్ వీ జూ పార్కు తరలించారు.

చెరువు బురదలో కూరుకుపోయిన ఏనుగును కాపాడే ప్రయత్నంలో జరిగిన ఆపరేషన్‌ను తమిళనాడు అటవీ శాఖ అధికారులు కూడా పర్యవేక్షించారు. గత వారం రోజుల క్రితం దాదాపు 13 ఏనుగులు ఏపీ తమిళనాడు సరిహద్దులోని పరదరామి అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్టు గుర్తించిన అధికారులు.. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ ఏనుగు ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఇలా ప్రమాదానికి గురై ఉంటుందని భావిస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.