సీఎం జగన్ 7వ రోజు బస్సు యాత్రకు అపూర్వ స్పందన.. 8వ రోజు షెడ్యూల్ ఇదే
రాబోయే ఎన్నికలు.. చంద్రబాబుకు ప్రజల మధ్య జరిగే యుద్ధమని అన్నారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు పాలన, జగన్ పాలన బేరీజు వేసుకుని ఓటు వేయాలని ప్రజలను కోరారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తేనే వాలంటీర్లు ఇంటికొచ్చి పెన్షన్ ఇస్తారని చెప్పారు.
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏడో రోజు చిత్తూరు జిల్లాలో కొనసాగింది. అమ్మగారిపల్లె నుంచి బయల్దేరిన ఏపీ ముఖ్యమంత్రి యాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అమ్మగారిపల్లె నైట్ స్టే పాయింట్ దగ్గర సీఎం జగన్‌ను అన్నమయ్య, చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు కలిశారు. కుప్పంకు చెందిన సుబ్రమణ్యంనాయుడు, కృష్ణమూర్తి, బేతప్ప వైసీపీలో చేరారు. కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సీఎం జగన్ బస్సుయాత్ర మతుకువారిపల్లెకు చేరుకుంది. దారిపొడవునా సీఎం జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మధ్యమధ్యలో తనను కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడారు సీఎం జగన్. పెరాలసిస్ బాధితుడు ముఖేశ్‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అక్కడి నుంచి కల్లూరు చేరుకున్న సీఎం జగన్‌కు జనం నీరాజనం పలికారు. కల్లూరు ప్రధాన మార్గం పొడవునా ముఖ్యమంత్రి జగన్‌ను చూసేందుకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. సీఎం జగన్ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రకు విశేష స్పందన లభించింది. సుమారు 20 క్రేన్లతో భారీ గజమాలలు ఏర్పాటు చేసి జగన్‌కు స్వాగతం పలికారు.
అక్కడి నుంచి పూతలపట్టు చేరుకున్న సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపు ఉన్నాయని జగన్ అన్నారు. రాబోయే ఎన్నికలు మోసం చేసే చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధమని కామెంట్ చేశారు. తనపై అందరూ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరికి ఓటేస్తే భవిష్యత్ మారుతుందో ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలను కోరారు.
సభ అనంతరం రేణిగుంట మీదుగా గురవరాజుపల్లె వరకు బస్సు యాత్ర కొనసాగింది. గురువారం సీఎం జగన్ బస్సుయాత్ర గురవరాజుపల్లె నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి మల్లవరం, ఏర్పేడు మీదగా పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదగా చిన్న సింగమల సమీపంలో 11 గంటలకు చేరుకుంటుంది. అక్కడ లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ఏపీ సీఎం ముఖముఖిలో పాల్గొంటారు. సాయంత్రం నాయుడుపేటలో జరగబోయే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్, మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డిపాలెం చేరుకుని అక్కడి రాత్రి బస చేస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..