
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలపాలనే ప్రతిపాదన వస్తే అంగీకరిస్తామన్న మంత్రుల వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. విభజన జరిగి, రెండు సార్లు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రకటనలు చేయడం వైసీపీ ప్రభుత్వ పాలనకు నిదర్శనంగా మారుతోందని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి.. ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో రైతు ఆత్యహత్యలు పెరగాయన్న చంద్రబాబు.. వాటిపై దృష్టి సారించకుండా సమైక్య రాష్ట్రంపై ప్రకటనలు చేయడం దారుణమని విమర్శించారు. మద్దతు ధర లేకపోవడం, సబ్సిడీలు నిలిచిపోవడం వంటివి అన్నదాతల బలవన్మరణాలకు కారణం అవుతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్లే రాష్ట్రానికి జరిగిన నష్టమే ఎక్కువ అని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే సమైక్య రాష్ట్ర ప్రకటనలు ఆపి.. రైతుల ఆత్మహత్యలు, ప్రజాసమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడు హితవు పలికారు.
టీడీపీ పాలనలో వ్యవసాయ రంగం, ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రికార్డులు సాధించింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లకే 1,673 రైతులు ఉసురు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సూసైడ్స్ స్టేట్‌గా మారిపోయింది. ప్రజలపై ప్రభుత్వ వేధింపులు, కక్ష సాధింపులు ఎక్కువయ్యాయి. రెండు రాష్ట్రాలు కలవాలి, కలపాలి అంటూ ప్రజలను గందరగోళానికి గురిచేసి సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై మాట్లాడకుండా మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు.
– నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
ఇప్పటికైనా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే సమైక్య రాష్ట్ర ప్రకటనలు ఆపి… రైతుల ఆత్మహత్యలు, ప్రజల సమస్యలకు కారణాలు విశ్లేషించాలి. సత్వర స్పందనతో ప్రణాళిక అమలుపరిచి అన్నదాతలకు అండగా నిలవాలి.(5/5)
— N Chandrababu Naidu (@ncbn) December 10, 2022
కాగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం కలిగించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిపే ప్రతిపాదన వస్తే అందుకు తాము అంగీకారం తెలుపుతున్నట్లు వెల్లడించారు. ప్రజా ప్రయోజనాల కోసం వైసీపీ ఎప్పుడూ వెనకడుగు వేయదని, ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని సజ్జల స్పష్టం చేశారు. కాగా.. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎంతో మంది బలిదానం, ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణను మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసినట్లే అవుతోందని ఘాటుగా ప్రతిస్పందించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..