Chandrababu Naidu Arrested: చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై తీర్పు మంగళవారానికి వాయిదా

| Edited By: Ram Naramaneni

Sep 11, 2023 | 10:20 PM

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ శ్రేణులు చేపట్టిన ఏపీ బంద్‌కు పాక్షిక స్పందన లభించింది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పాక్షిక స్పందన లభించగా రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో విజయవంతమైంది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారని టీడీపీ నేతలు అంటుండగా, బంద్‌ను ప్రజలు అసలు పట్టించుకోలేదని వైసీపీ నేతలంటున్నారు.

Chandrababu Naidu Arrested:  చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై తీర్పు మంగళవారానికి వాయిదా
Chandrababu In Jail

స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్‌ బంద్‌ నిర్వహించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. ఉత్తరాంధ్రలో బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. బస్సులు, ఇతర రవాణా వ్యవస్థలు యథావిధిగా నడిచాయి. ప్రైవేటు విద్యాలయాలను స్వచ్ఛందంగా మూసివేశారు. కొన్నిచోట్ల పోలీసుల భరోసాతో వ్యాపార సంస్థలు మాత్రం తెరుచుకున్నాయి. టీడీపీ ముఖ్యనేతల హౌస్ అరెస్ట్‌తో బంద్ ప్రభావం కనిపించలేదు.

కోస్తా జిల్లాల్లో బంద్‌ పాక్షికంగా జరిగింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు సాధారణంగానే నడిచాయి. పలుచోట్ల టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసి ఆందోళన చేపట్టారు. ఎప్పటికప్పుడు అరెస్ట్‌లతో బంద్ ప్రభావం తగ్గింది. రాయలసీమలో టీడీపీ బంద్ పాక్షికంగా జరిగింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మినహా అంతటా ప్రశాంతంగా జరిగింది. కుప్పంలో టీడీపీ కార్యకర్తలు ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టారు. బంద్‌కు వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ, జనసేన నేతలను ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాణ్యం, మంత్రాలయంలో పూర్తిస్థాయిలో బంద్ జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం, రాప్తాడులో బంద్‌ విజయవంతమైంది. కడప జిల్లాలో బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు.
ప్రొద్దుటూరులో టిడిపి కార్యకర్తలకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి స్పృహ తప్పి పడిపోయారు.

గుంటూరులో బంద్‌ నిర్వహిస్తున్న టీడీపీ, జనసేన, ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలను మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు లాఠీ పట్టుకుని తరిమే యత్నం చేశారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న తమపై దాడికి యత్నించినా పోలీసులు చూస్తుండిపోయారే తప్ప ఏ చర్యలూ తీసుకోలేదని టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆరోపించారు.

మరోవైపు బంద్‌కు మద్దతిచ్చి.. నిరసనల్లో పాల్గొన్న టీడీపీ, జనసేన, సీపీఐ కార్యకర్తలకు నారా లోకేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. నిరసనలను అణిచివేసేందుకు, బంద్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని వాడుతోందని లోకేశ్‌ విమర్శించారు. చంద్రబాబు అరెస్టును యావత్తు రాష్ట్రం ఖండించిందని, ప్రభుత్వ కుట్రపూరిత చర్యలపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోందన్నారు లోకేశ్‌. భవిష్యత్ కార్యాచరణపై మంగళ, బుధ వారాల్లో టీడీపీ నేతలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Sep 2023 08:32 PM (IST)

    అవినీతి ఆయన రక్తంలో లేదు..

    చంద్రాబాబు నాయుడు అరెస్ట్‌పై నారా లోకేష్‌ మరోసారి స్పందించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎమోషనల్ అయ్యారు. చంద్రబాబును అరెస్ట్ చేసి తప్పు చేశారని అన్నారు. అవినీతి చంద్రబాబు రక్తంలోనే లేదని చెప్పుకొచ్చారు.

  • 11 Sep 2023 07:12 PM (IST)

    హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా

    చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ న్యాయమూర్తి ఈ రోజు సుధీర్ఘ వాదనలు విన్న సంగతి తెలిసిందే. అయితే ఆర్డర్స్ రేపటికి వాయిదా వేసినట్లు తాజాగా అప్‌డేట్ వచ్చింది. రేపు ఆర్డర్స్ ఇస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. అయితే ఈ రోజు వాదనల్లో రిమాండ్‌ను హౌస్ కస్టడీగా మార్చాల్సిన అవసరం లేదని.. అలా జరిగితే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని సీఐడీ తరపు లాయర్లు వాదించారు. అయితే చంద్రబాబు తరపు లాయర్ లూథ్రా గతంలో ఇలాంటి కేసుల తాలుకా సుప్రీం కోర్టు తీర్పులకు ఉదహరించారు.

  • 11 Sep 2023 06:45 PM (IST)

    చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన మమత

    చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆరోపణలు వచ్చినప్పుడు ప్రశ్నించాలని.. విచారణ జరిపిన తరువాతే చర్యలు తీసుకోవాలన్నారు. కాని చంద్రబాబు విషయంలో ఇలా జరగలేదని , ఏపీలో అధికారంలో ఉన్నవాళ్లకు ఇది బూమరంగ్‌ అయ్యే అవకాశముందని హెచ్చరించారు.

  • 11 Sep 2023 05:52 PM (IST)

    టీడీపీ ముఖ్య నేతలతో నారా లోకేశ్ భేటీ

    చంద్రబాబు అరెస్టు, రిమాండ్ తరువాత పరిణామాలు, బంద్ పరిస్థితులపై నేతలతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చర్చించారు. ముఖ్య నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులతో సమావేశమైన లోకేశ్.. తదుపరి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలనేే అంశంపై చర్చించారు. పార్టీ లీడర్స్ సూచనలు, ఫీడ్ బ్యాక్ మేరకు తదుపరి ప్రణాళికకు సూచనలు చేశారు. బంద్​కు మద్దతు ఇచ్చి నిరసనల్లో పాల్గొన్న జనసేన, సీపీఐ, ఎమ్మార్పీస్ కార్యకర్తలకు లోకేశ్ థ్యాంక్స్ చెప్పారు.

  • 11 Sep 2023 04:22 PM (IST)

    మరికాసేపట్లో హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

    చంద్రబాబుకు జైలులో థ్రెంట్ ఉందని ఆయన తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా కోర్టులో వాదించారు. చంద్రబాబు ఇప్పటివరకు NSG భద్రతలో ఉన్నారన్న ఆయన.. చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం వ్యక్తం చేశారు. హౌస్ కస్టడీకి సంబంధించి..  గతంలో భాతర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును లూథ్రా న్యాయమూర్తికి అందజేశారు. గౌతం నవార్కర్‌ కేసును ఉదహారణగా చూపారు. హైకోర్టుకు వెళ్లి తెచ్చుకున్న సెక్యూరిటీ పెంపు ఆదేశాలు అమల్లో ఉన్నాయన్నారు. చంద్రబాబును హౌస్ కస్టడీకి పర్మిషన్ ఇవ్వాలని సిద్ధార్థ లూథ్రా కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి నాలుగున్నర తీర్పు వెలువరించనున్నారు.

  • 11 Sep 2023 03:50 PM (IST)

    నేడు బాబుతో ములాఖత్‌ రద్దు

    ములాఖత్‌కి ఈరోజు చంద్రబాబు కుటుంబసభ్యులు దరఖాస్తు చేసుకోలేదు. సమయం అయిపోవడంతో ములాఖత్‌ రద్దు చేశారు అధికారులు. రేపు చంద్రబాబును కుటుంసభ్యులు కలిసే అవకాశం ఉంది. ముగ్గురికి అనుమతి ఇస్తామంటున్నారు అధికారులు. చంద్రబాబుతో ఏం మాట్లాడాలనే దానిపై.. పార్టీ నేతలతో ఈ సాయంత్రం లోకేష్ చర్చలు జరపనున్నారు.  భవిష్యత్ కార్యాచరణపై రేపు చంద్రబాబుతో చర్చించనున్నారు లోకేష్. మరోవైపు చంద్రబాబును కలిసేందుకు పలువురు పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

  • 11 Sep 2023 03:41 PM (IST)

    చంద్రబాబు అరెస్టుపై టీడీపీ వర్సెస్ వైసీపీ

    చంద్రబాబు అరెస్టుపై టీడీపీ, వైసీపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవల వచ్చిన సర్వేలు చూసి జగన్ భయపడుతున్నారని టీడీపీ విమర్శిస్తే, భయపడాల్సిన సీన్‌ లేదని వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. మరోవైపు చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

  • 11 Sep 2023 03:12 PM (IST)

    చంద్రబాబు పూర్తి భద్రత మధ్య ఉన్నారు: పొన్నవోలు

    చంద్రబాబు పూర్తి ఆరోగ్యం, పూర్తి భద్రత మధ్య ఉన్నారని ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి తెలిపారు. ఇంట్లో ఉండటం కంటే జైలులో ఉండటం చంద్రబాబుకు సేఫ్టీ అన్నారు.  సుప్రీం కోర్టు ఇచ్చిన కేసు తీర్పును చంద్రబాబు కేసుకు ముడిపెట్టకూడ దన్నారు. వీఐపీ ముద్దాయికి కల్పించే అన్ని వసతులు జైల్లో కల్పించినట్లు తెలిపారు. జైలు పరిసర ప్రాంతాల్లో పోలీసు సెక్యూరిటీ ఉందని..  24గంటలు పోలీసులు డ్యూటీలో ఉన్నారని తెలిపారు. హౌస్ అరెస్ట్ చేస్తే.. ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందన్నారు.

  • 11 Sep 2023 02:06 PM (IST)

    చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది -రోజా

    చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతున్నారు వైసీపీ మంత్రులు నేతలు. అవినీతి చేసిన బాబును.. చట్టప్రకారం అరెస్ట్ చేయకూడదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమే అని.. మున్ముందు మరిన్ని అవినీతి బాగోతాలు వెలుగులోకి వస్తాయంటున్నారు వైసీపీ నేతలు.

  • 11 Sep 2023 01:55 PM (IST)

    చంద్రబాబుకు మధ్యాహ్న భోజనం తెచ్చిన భద్రతా సిబ్బంది..

    జైలులో ఉన్న చంద్రబాబుకు ఇంటి భోజనాన్ని పంపేందుకు కోర్ట్ అనుమతించింది. దీంతో ఇంటి భోజనాన్ని పంపిస్తున్నారు కుటుంబసభ్యులు. ఉదయం అల్ఫాహారంగా ఫ్రూట్ సలాడ్, వేడినీళ్లతో పాటు కాఫీ తీసుకెళ్లారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా.. పుల్కా, వెజ్ కర్రీతో పాటు సలాడ్, ఫ్రూట్ బౌల్, గ్రీన్ టీ, మజ్జిగ, వేడినీళ్లు అందించారు.

  • 11 Sep 2023 01:36 PM (IST)

    గుంటూరులో ఉద్రిక్తత.. వైసీపీ, జనసేన మధ్య గొడవ

    గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది..వైసీపీ వర్సెస్‌ జనసేనగా మారింది పరిస్థితి..గుంటూరులోని అరండల్‌పేటలో మేయర్‌, ఎమ్మెల్యే పర్యటిస్తున్నారు..అటు బాబు రిమాండ్‌కు నిరసనగా బంద్‌ పాటిస్తూ షాపులు బంద్‌ చేస్తోంది జనసేన..అయితే బంద్‌ పాటిస్తున్న షాపులు ఓపెన్‌ చేసేందుకు యత్నించారు మేయర్‌..ఇది చూసి మేయర్‌ను అడ్డుకునేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు యత్నించారు.. ఎదురుగా వస్తున్న రెండు పార్టీల నేతలు, కార్యకర్తలతో అరండల్‌పేట్‌లో ఉద్రిక్తత తలెత్తింది.. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు..పలవురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..

  • 11 Sep 2023 01:18 PM (IST)

    చంద్రబాబు రిమాండ్‌పై ఏసీబీ కోర్టు తీర్పు కాపీ విడుదల

    • స్కిల్‌ స్కాంలో చంద్రబాబుపై ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి: తీర్పులో ఏసీబీ కోర్టు

    • అవినీతి నిరోధక చట్టం కింద ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయి: ఏసీబీ కోర్టు

    • నేరపూరిత కుట్ర, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చడం, ప్రజాప్రతినిధిగా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డం, ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడం..తదితర ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయి: ఏసీబీ కోర్టు

    • రూ.279 కోట్ల రూపాయల అవినీతి, అక్రమ పద్ధతుల్లో తరలింపు తద్వారా ప్రభుత్వ ఖజానకు నష్టం చేకూర్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి: ఏసీబీ కోర్టు

  • 11 Sep 2023 01:03 PM (IST)

    చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌ రాజకీయ కక్ష సాధింపు చర్య కాదు.. కన్నబాబు

    చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌ రాజకీయ కక్ష సాధింపు చర్య కాదన్నారు వైసీపీ నేత కురసాల కన్నబాబు. సీఎం జగన్‌, చంద్రబాబును జైలుకు పంపించారన్న టీడీపీ నేతల ఆరోపణల్లో నిజం లేదన్నారాయన. పక్కా ఆధారాలతోనే చంద్రబాబును న్యాయస్థానం జైలుకు పంపిందన్నారు కన్నబాబు.

  • 11 Sep 2023 12:40 PM (IST)

    యువగళం పాదయాత్ర వాయిదా..

    నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర కోనసీమ జిల్లా పొదలాడ వద్ద బ్రేక్‌ పడింది. చంద్రబాబు అరెస్ట్, తాజా పరిణామాల ప్రభావంతో యాత్రను వాయిదా వేసుకున్నారు లోకేష్. తిరిగి పాదయాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనేది చెబుతామన్నారు

  • 11 Sep 2023 12:15 PM (IST)

    చంద్రబాబు అరెస్ట్‌, రిమాండ్‌పై అచ్చెన్నాయుడు కామెంట్స్..

    టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కావాలనే అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. చంద్రబాబు అరెస్ట్‌, రిమాండ్‌పై టీడీపీ, జనసేన నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌ కూడా ఆందోళన వ్యక్తం చేశారని మీడియాకు వెల్లడించారు అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో టీడీపీ బలపడుతుందని గ్రహించి, పక్కా ప్లాన్‌ ప్రకారమే చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారాయన.

  • 11 Sep 2023 11:50 AM (IST)

    టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌..

    చంద్రబాబు రిమాండ్‌కు నిరసనగా ఇవాళ ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది..అటు టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు..విజయవాడలో బుద్దా వెంకన్నను అరెస్ట్‌ చేశారు.. మంత్రి అంబటి వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు..వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబుని జైలుకు పంపారు..అంబటి చేసిన అక్రమాలు ఎవరు చెయ్యలేదు..అవినీతిపై మాట్లాడే అంబటికి హక్కు లేదు అంటూ మండిపడ్డారు బుద్దా వెంకన్న..

  • 11 Sep 2023 11:33 AM (IST)

    చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సంచలన వ్యాఖ్యలు

    • చంద్రబాబుకు ప్రాణహాని ఉంది, జైల్లో ఉంచడం సరికాదు

    • ఇవాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నాం -సిద్ధార్థ్ లూథ్రా

    • హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై మా వాదనలు వినిపిస్తాం

    • ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేయలేదు -లూథ్రా

  • 11 Sep 2023 11:22 AM (IST)

    కావాలనే అక్రమంగా అరెస్టు చేశారు..

    టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కావాలనే అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. చంద్రబాబు అరెస్ట్‌, రిమాండ్‌పై టీడీపీ, జనసేన నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌ కూడా ఆందోళన వ్యక్తం చేశారని మీడియాకు వెల్లడించారు అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో టీడీపీ బలపడుతుందని గ్రహించి, పక్కా ప్లాన్‌ ప్రకారమే చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారాయన.

  • 11 Sep 2023 10:45 AM (IST)

    కొనసాగుతున్న టీడీపీ బంద్..

    విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ బంద్‌ కొనసాగుతోంది. విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట టీడీపీ కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు.

  • 11 Sep 2023 10:22 AM (IST)

    ఏపీ బంద్..

    టీడీపీ బంద్‌కు పిలుపుతో గుంటూరులో ప్రైవేటు విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్‌ అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత పెంచారు పోలీసులు

  • 11 Sep 2023 09:31 AM (IST)

    కర్నూలు జిల్లా టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్..

    టీడీపీ బంద్ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా టీడీపీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు. మంత్రాలయం టీడీపీ ఇంఛార్జి తిక్కారెడ్డి, ఆళ్లగడ్డ ఇంఛార్జి భూమా అఖిలప్రియను హౌస్ అరెస్టు చేశారు. బంద్‌లో పాల్గొనకుండా ఎక్కడెక్కడ టీడీపీ నేతలు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.

  • 11 Sep 2023 09:15 AM (IST)

    నెల్లూరు: ఆర్టీసీ బస్టాండ్ దగ్గర టీడీపీ ఆందోళన..

    ఏపీ బంద్‌లో భాగంగా నెల్లూరులో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. బస్టాండ్ నుండి బస్సులు బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

  • 11 Sep 2023 08:59 AM (IST)

    హౌస్ అరెస్ట్‌కు జైలు ఒప్పుకుంటుందా.?

    ఇంటి నుంచి భోజనం, మెడిసిన్స్‌ తెప్పించుకునేందుకు ఓ పిటిషన్, జైలుకు కాకుండా ఇంట్లోనే హౌస్‌ అరెస్ట్‌ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మరో పిటిషన్‌ దాఖలు చేశారు చంద్రబాబు. హౌస్‌మోషన్‌ రూపంలో ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఇంటి నుంచి భోజనం, మెడిసిన్స్‌ తెప్పించుకునేందుకు కోర్ట్ అనుమతించింది. హౌస్‌ అరెస్ట్‌ ఉత్తర్వుల కోసం చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. అయితే అసాధారణ, అరుదైన పరిస్థితుల్లో మాత్రమే హౌస్‌ అరెస్ట్‌ ఉత్తర్వులు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం అలాంటి అసాధారణ, అరుదైన పరిస్థితులు ఏవీ లేవని కోర్ట్ అభిప్రాయపడింది.

  • 11 Sep 2023 08:32 AM (IST)

    కాసేపట్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు..

    రాజమండ్రి సెంట్రల్ జైల్లో కాసేపట్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు. చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్ ఎదురుగానే జైలు ఆసుపత్రి ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ చంద్రబాబును కలవనున్నారు ముగ్గురు కుటుంబ సభ్యులు. చంద్రబాబును భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి కలిసేందుకు అనుమతినిచ్చారు పోలీసులు.

  • 11 Sep 2023 07:50 AM (IST)

    చంద్రబాబుకి ఖైదీ నెంబర్ 7691 కేటాయింపు..

    కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు కోసం జైల్లోని స్నేహ బ్లాక్‌లో ప్రత్యేక గదిని సిద్ధం చేశారు అధికారులు. చంద్రబాబుకి ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు జైలు అధికారులు. జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. చంద్రబాబుకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • 11 Sep 2023 07:30 AM (IST)

    రాజమండ్రిలో సెక్షన్ 30 అమలు..

    చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంతో నగరంలో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఇవాళ టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునివ్వడంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. అటు బాబుతో పాటు జామర్ వెహికల్, రెండు కార్లకు జైలులోకి అనుమతి ఇచ్చారు. హైప్రొఫైల్ వ్యక్తి కావడంతో ఎన్‌ఎస్‌జీ బృందం జైలులో కూడా ఆయనకు భద్రతగా ఉంది.

  • 11 Sep 2023 07:17 AM (IST)

    నేడు ఏపీ బంద్..

    స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌కు నిరసనగా టీడీపీ నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి జనసేన, ఎం‌ఆర్‌పీఎస్ మద్దతు ప్రకటించాయి. బంద్ నేపధ్యంలో రాష్ట్రంలోని బస్ డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా 144 సెక్షన్‌ను అమలు చేయాలని అన్ని జిల్లాల పోలీసులను సూచించారు ఉన్నతాధికారులు.

  • 11 Sep 2023 07:11 AM (IST)

    చంద్రబాబు, సీఐడీ పిటిషన్లపై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ

    చంద్రబాబు, సీఐడీ పిటిషన్లపై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబును జైలుకు బదులు గృహనిర్బంధంలో ఉంచాలని పిటిషన్‌‌ను.. సీఐడీ జ్యూడిషియల్ కస్టడీ పిటిషన్‌పైనా ఇవాళ విచారించనుంది న్యాయస్థానం. చంద్రబాబు బెయిల్ కోసం.. ఆయన తరపున న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.

Follow us on