Andhra Pradesh: “అప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టను.. మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించాలి”.. పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచన
నేటి నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అసెంబ్లీలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగినా, బిల్లు..
నేటి నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అసెంబ్లీలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగినా, బిల్లు చేపట్టినా తీవ్రంగా వ్యతిరేకించాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. సమావేశాలను కేవలం ఐదు రోజులకు పరిమితం చేయడాన్ని తప్పుబట్టారు. మూడు రాజధానుల అంశం గురించి ప్రస్తావిస్తే అప్పట్లో ప్రతిపక్ష నేతగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతికి మద్దతు ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేయాలని పేర్కొన్నారు. కాగా.. రాజధాని, పోలవరం అంశాలపై చర్చించేందుకు చంద్రబాబు అసెంబ్లీకి రావాలని మంత్రులు, వైసీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. వీటిపై స్పందించిన చంద్రబాబు (Chandrababu Naidu) కౌరవులందర్నీ క్షేత్రస్థాయిలో ఓడించాకే గౌరవసభకు వస్తానని స్పష్టం చేశారు.
మూడు రాజధానులే ప్రభుత్వ విధానమా. అదే అయితే ఈ అంశంపై అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలి. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, భారీ వర్షాలు వరదలకు పంటనష్టం, అక్రమ మైనింగ్, మద్యం, ఇసుక కుంభకోణం, పోలవరం వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చించాలి. రైతులు చేపట్టిన పాదయాత్ర – 2 కు వస్తున్న స్పందన చూసి, ఓర్వలేక ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అరెస్టులు చేయిస్తోంది. జగన్ అన్ని వ్యవస్థల్నీ భయపెట్టి తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. ఈ అంశాలపై న్యాయపోరాటం చేయాలి.
– చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి
కాగా..ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు స్టార్ట్ అవుతాయి. ఈ సమావేశాల్లో రెవెన్యూశాఖ 4 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్ర రాజధానులపై ప్రభుత్వం చర్చించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని అంటూ రైతులు ఒకవైపు మహాపాదయాత్ర చేస్తుండగా, మరోవైపు 3 రాజధానుల అంశమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం సమావేశాలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..