Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్.. ఒకేసారి రెండు పథకాలు ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్..
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. మార్చి నాటికి ఉగాది కానుకగా రెండు పథకాలను విస్తరించనున్నారు. కొత్త అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో పాటు పేదలకు నిర్మించిన ఇళ్ల ప్రారంభంపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఉగాది రోజును వీటిని ప్రారంభిస్తామని తెలిపారు.

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్తలు అందించారు. ఒకేసారి డబుల్ బొనాంజా అందించారు. రాష్ట్రంలోని సామాన్య ప్రజలందరికీ ప్రయోజనం అందించే తీపికబురు అందించారు. ఒకటి ఇళ్ల నిర్మాణం కాగా.. మరొకటి అన్న క్యాంటీన్లు. ఉగాది గిఫ్ట్‌గా మార్చి నాటికి వీటిని ప్రజలకు ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త అన్న క్యాంటీన్లను సంక్రాంతి సందర్భంగా ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. నిర్మాణంలో జాప్యం జరగడం వల్ల నిలిపివేశారు. వీటిని ఎప్పుడు ప్రారంభిస్తామనేది చంద్రబాబు స్పష్టతిచ్చారు. అలాగే పేదలకు కొత్త ఇళ్లను మంజూరు చేస్తుండగా.. తాజాగా వీటికి ఎప్పుడు గృహప్రవేశాలు చేస్తామనేది కూడా వెల్లడించారు.
ఉగాది రోజున కొత్త అన్న క్యాంటీన్లు
ఉగాది రోజు మార్చి 19న రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 700 అన్న క్యాంటీన్లను కొత్తగా ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వీటి ద్వారా గ్రామాణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, కూలీలు, పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం లభిస్తుందని అన్నారు. ఇప్పటివరకు సిటీలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేయగా.. ఉగాది నుంచి మండల కేంద్రాల్లో కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు అవుతాయన్నారు. మండల కేంద్రాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేల నుంచి వినతులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ సంక్రాంతికే కొత్త అన్న క్యాంటీన్లను ప్రారంభించాల్సి ఉంది. కానీ కొన్ని అడ్డంకులు రావడంతో వాయిదా వేశారు. ఉగాదికి ఏకంగా 700 అన్న క్యాంటీన్లు కొత్తగా రానుండటంతో ఇది ఏపీ ప్రజలకు తీపికబురుగా చెప్పవచ్చు. కేవలం రూ.5కే టిఫిన్, లంచ్, డిన్నర్ చేయవచ్చు.
కొత్త ఇళ్లు ప్రారంభం
ఉగాది రోజున 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటివరకు 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. 5 ఏళ్లలో 15 లక్షల ఇళ్లు నిర్మించాలనే లక్ష్యం పెట్టుకున్నామని అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహప్రవేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ప్రసంగం చేశారు. ఎన్టీఆర్ స్పూర్తితోనే అన్న క్యాంటీన్లు తెచ్చామని, ఉగాది సందర్భంగా 700 కొత్త అన్న క్యాంటీన్లను నెలకొల్పుతామన్నారు. పీఎం అవాస్ యోజన పథకంతో భాగస్వామ్యమై రాష్ట్రంలోని పేదలకు పక్కా ఇల్లు నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే మంజూరైన ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. అందరికీ ఇల్లు అనే కాన్సెప్ట్‌తో ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు. పేదలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, సూపర్ సిక్స్ పథకాలను హామీ ప్రకారం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
