త్వరలో తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న తన పర్యటనలో భాగంగా ఈ రోజు(ఫిబ్రవరి 14) పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి.. త్వరలో తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ రైలు వచ్చే అవకాశం ఉందన్నారు. అంతేకాక హైదరాబాద్ పరిధిలోని చర్లపల్లి వద్ద రైల్వే టెర్మనల్‌ను కూడా నిర్మిస్తామని, పలు రైళ్లను కూడా పొడిగిస్తామన్నారు. ముందుగా ధర్మవరం-విజయవాడ ఎక్స్ ప్రెస్ రైలు( 17216)ను మచిలీపట్నం వరకు పొడిగించిన ఆయన.. ఆ రైలుకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో వేగంగా కొత్త లైన్లు, ఎలక్ట్రిఫికేషన్, ట్రిప్లింగ్ పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు. గన్నవరం విమానాశ్రయంతో సరిసమాన సౌకర్యాలతో విజయవాడ రైల్వే స్టేషన్‌ను పునరాభివృద్ధి పనులు చేపటనున్నట్టు ఆయన వెల్లడించారు .ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ప్రాజెక్ట్ రిపోర్ట్ పురోగతిలో ఉందని, త్వరలోనే టెండర్లు ప్రక్రియకు సంబంధించి ప్రకటన జారీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ రైల్వేలు భారతదేశ ప్రజలందరికీ.. ఆధునిక సాంకేతికతతో కూడిన అత్యుత్తమ రైల్వే సేవలను అందించడంపై దృష్టి సారించాయని మంత్రి పేర్కొన్నారు. ఇంకా తిరుపతి-నెల్లూరు రైల్వే స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దుతామని, రాజమండ్రి, గూడూరు వంటి ముఖ్యమైన స్టేషన్లను ఆధునికీకరిస్తామని తెలిపారు. హైదరాబాద్ వచ్చే ఆంధ్రులకు చర్లపల్లి వద్ద రైల్వే టెర్మినల్ నిర్మిస్తామని వివరించారు. అంతేకాక త్వరలో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలు వచ్చే అవకాశం ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. డిసెంబరులోగా 100 వందేభారత్ రైళ్లు నడపాలని కేంద్రం నిర్ణయించినట్టు మరో సారి గుర్తు చేశారు కిషన్ రెడ్డి. ఏపీలో రైల్వే విభాగానికి బడ్జెట్ లో రూ.8,600 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
షిరిడీ-విజయవాడ ఎక్స్ ప్రెస్‌ను మచిలీపట్నం వరకు పొడిగిస్తామని పేర్కొన్నారు. హుబ్లీ-విజయవాడ ఎక్స్ ప్రెస్ రైలును నర్సాపురం వరకు పొడిగిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. నంద్యాల-కడప ఎక్స్ ప్రెస్ ను రేణిగుంట వరకు పొడిగిస్తామని వివరించారు. విశాఖ-కాచిగూడ రైలును మహబూబ్ నగర్ వరకు… విశాఖ-విజయవాడ ఎక్స్ ప్రెస్ ను గుంటూరు వరకు పొడిగిస్తామని తెలిపారు.