సముద్ర తీరంలో తాబేళ్ల మృత్యుఘోష.. ఒడ్డుకు కొట్టుకువచ్చిన అరుదైన జాతి తాబేళ్ల కళేబరాలు
సముద్ర తీరప్రాంతాల్లో గుడ్లు పెట్టేందుకు వస్తున్న తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. మొన్న కోస్తా తీరంలో తాబేళ్ల మృత్యుఘోష వినిపిస్తే.. నిన్న ప్రకాశం జిల్లాలో తాబేళ్ల కళేబరాలు కొట్టుకొచ్చాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాలకు అరికట్టేందుకు.. అరుదైన జీవాలను కాపాడేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
కోస్తాతీరం ఎక్కువగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఆలివ్ రిడ్లీ జాతికి చెందిన పెద్ద పెద్ద తాబేళ్లు పదుల సంఖ్యలు మృత్యువాడ పడ్డటం ఆందోళన కలిగిస్తోంది. ఒడ్డుకు కొట్టుకువచ్చిన తాబేళ్ల కళేబరాలను మత్య్సాకారులు గుర్తించారు. జిల్లాలోని కొత్తపట్నం మండలం నుంచి సింగరాయకొండ మండలం పాకల, టంగుటూరు మండలం పసుకుదురు తీర ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో వీటి కళేబరాలను గుర్తించారు. గుడ్లు పొదిగేందుకు వేల కిలోమీటర్లు ప్రయాణించి తీర ప్రాంతాలకు చేరుకునే ఈ తాబేళ్లు… మత్స్యకారులు చేపల వేటకు ఉపయోగించే పడవలు, వలలకు తగిలి మృత్యువాత పడుతున్నాయి.
కొంతమంది సముద్రం ఒడ్డుకు దగ్గరలో పెద్ద పడవలతో అక్రమంగా చేపలను వేటాడుతుండడంతో .. ఒడ్డుకు వచ్చే క్రమంలో ఈ తాబేళ్లు పడవలు తగిలి, వలలకు చిక్కి చనిపోతున్నాయని మత్య్సకారులు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా నిత్యం పదుల సంఖ్యలో ఆలివ్‌రిడ్లే తాబేళ్ల కళేబరాలు తీరానికి కొట్టుకురావడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాబేళ్లను పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. మరోవైపు ఇటీవల కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మరణిస్తుండటంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని… తాబేళ్లు మృతి చెందడానికి గల కారణాలను తెలుసుకొని, కారకులపై చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. వన్యప్రాణుల పరిరక్షణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లను కాపాడేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..