CM Revanth Reddy: ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్..!
రీజనల్ రింగ్ రోడ్డును సూపర్ గేమ్‌ఛేంజర్‌గా భావిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. వీలైనంత త్వరగా నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తరభాగం నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి కేంద్రం టెండర్లను ఆహ్వానించింది. ఫిబ్రవరి 14 వరకు టెండర్లను స్వీకరించనున్నారు అధికారులు. టెండర్లు పూర్తవగానే పనులను స్పీడప్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్.
రీజనల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం(జనవరి 3) సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా నార్త్ పార్ట్ పై కేంద్రం ఇటీవల టెండర్లు పిలిచింది. ఈ భాగంలో 95 శాతం భూసేకరణ పూర్తయినట్లు సమాచారం. త్వరగా టెండర్లు ఖరారు చేసి, పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. అయితే నిధుల సమీకరణపై సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది.
సౌత్ పార్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్మించాలని నిర్ణయం తీసుకోగా, డీపీఆర్ తయారీకి టెండర్లను ఆహ్వానించింది. అయితే, టెండర్ దాఖలు చేయడానికి ఏ ఒక్క కంపెనీ ముందుకు రాకపోవడంతో మళ్లీ టెండర్లు పిలవాల్సి వచ్చింది. సౌత్ పార్ట్ నిర్మాణానికి దాదాపు రూ.18,000 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ నిధుల కోసం జైకా, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థల నుండి రుణాలను పొందే యోచనలో ఉంది సర్కార్. కానీ ప్రాజెక్టు వ్యయం అధికంగా ఉండే అవకాశం, ప్రస్తుత పరిస్థితుల్లో అంత పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
ఇదే సమయంలో, సౌత్ పార్ట్ నిర్మాణ బాధ్యతను కేంద్రమే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. భూసేకరణ, అటవీ అనుమతులు, అలైన్‌మెంట్‌లో సమీప ప్రాంతాల ప్రాముఖ్యత వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలో చర్చించనున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో నేషనల్ హైవే పనుల పురోగతి, భూసేకరణ సమస్యల గురించి సంబంధిత అధికారులతో సీఎం సమాచారం తీసుకోనున్నారు. సమీక్షకు ముందు గురువారం(జనవరి 2) ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, సెక్రటరీ దాసరి హరిచందన, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి శివశంకర్ తో సీఎస్ శాంతి కుమారి సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఆర్‌పై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు.
ఇదిలావుంటే, రీజనల్ రింగ్ రోడ్… ఉత్తరభాగంలో నిర్మించే 4 లేన్ల రహదారికి 11 జాతీయ, రాష్ట్ర రహదారులు అనుసంధానం కానున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ రీజినల్ ఎక్స్‌ప్రెస్‌వేగా వ్యవహరించే ఈ రహదారికి అనుసంధానంగా ఉండే మార్గాల ద్వారా.. మన మహానగరంతో పాటు నగర శివార్లలోకి కూడా రాకుండానే నేరుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేయవచ్చు. వివిధ జిల్లా కేంద్రాలకు కూడా నేరుగా వెళ్లొచ్చు. అంతర్రాష్ట్ర వాహనాలకు ఎంతో దూరాభారం తగ్గనుంది. ఫలితంగా హైదరాబాద్ ప్రాంత పరిధిలో వీటి తాకిడి తగ్గే అవకాశాలున్నాయి. కనెక్టివిటీ పెరగడంతో ఎకనామిక్ కారిడార్‌గా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. ఈ రహదారితో అనుసంధానమయ్యే జిల్లాల్లోనూ వ్యాపార రంగం మరింత వృద్ధి చెందనుంది. ఇంటర్‌ఛేంజ్‌ల దగ్గర వివిధ ఆకృతుల్లో రోడ్లను నిర్మించనుండడంతో ఈ ప్రాంత రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..